గృహ నిర్మాణంలో దేశానికే ఏపీ ఆదర్శం

AP Is An Ideal For The Country In Housing Construction - Sakshi

ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌

రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం

మౌలిక సదుపాయాల కల్పనకే రూ.34,109 కోట్లు

విద్యుదీకరణకు రూ.7,080 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న శ్రీకాంత్‌ నాగులాపల్లి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జగనన్న కాలనీల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ తెలిపారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’కు సంబంధించి ఇంధన శాఖ చేపడుతున్న పనుల ప్రగతిపై ఆదివారం అజయ్‌ జైన్, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌లు మూడు డిస్కంల సీఎండీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ఇంధన పర్యవేక్షక మిషన్‌ సీఈవో చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా 28.30 లక్షల ఇళ్లను రెండు దశల్లో నిర్మిస్తున్నట్టు అజయ్‌ జైన్‌ చెప్పారు. ఆ ఇళ్లకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకే ప్రభుత్వం రూ.34,109 కోట్లు వెచ్చిస్తోందన్నారు. పేదల ఇళ్లకు మౌలిక సదుపాయాల కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం దేశంలోనే లేదన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పనులన్నీ పూర్తిచేయాలని గడువు విధించినట్టు అజయ్‌ జైన్‌ చెప్పారు.

విద్యుదీకరణకు రూ.7,080 కోట్లు
వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో విద్యుదీకరణ పనులకు రూ.7,080 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి చెప్పారు. 550 ప్లాట్ల కంటే తక్కువ ఉన్న లే అవుట్లకు ఓవర్‌ హెడ్, 550 ప్లాట్ల కంటే ఎక్కువగా ఉన్న లే అవుట్లకు భూగర్భ విద్యుత్‌ను అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా డిస్కంల సీఎండీలు హరనాథరావు(ఏపీఎస్పీడీసీఎల్‌), పద్మాజనార్దనరెడ్డి(ఏపీసీపీడీసీఎల్‌), సంతోషరావు (ఏపీఈపీడీసీఎల్‌)లు మాట్లాడుతూ ఓవర్‌ హెడ్‌ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.98,521, భూగర్భ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి రూ.1,32,284 ఖర్చవుతుందని తెలిపారు. 550 ప్లాట్ల కంటే తక్కువ ఉన్న లే అవుట్లలో మొత్తం విద్యుదీకరణకు రూ.2,368 కోట్లు, 550 కంటే ఎక్కువగా ఉన్న లేఅవుట్లలో రూ.3,628 కోట్లు ఖర్చవుతుందన్నారు. 389లే అవుట్లకు భూగర్భ, 9,678 లే అవుట్లకు ఓవర్‌ హెడ్‌ విద్యుత్‌ అందిస్తున్నట్టు వారు వివరించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top