బాగా కష్టపడ్డా కానీ.. మొదటి ర్యాంక్‌ ఊహించలేదు: ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 టాపర్‌ సుష్మిత

AP Group 1 Exams: Top Ranker Rani Sushmitha Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌(చిక్కడపల్లి): బాగా కష్టపడ్డా కానీ.. మొదటి ర్యాంక్‌ వస్తుందని ఊహించలేదంటూ ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ఫస్ట్‌ ర్యాంకర్‌ రాణి సుష్మిత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురానికి చెందిన ఆమె ఏపీ గ్రూప్స్‌ ఫలితాల్లో టాప్‌ ర్యాంక్‌ సాధించారు. బుధవారం హైదరాబాద్‌ అశోక్‌ నగర్‌లోని ఏకేఎస్‌–ఐఏఎస్‌ అకాడమీలో సుష్మిత మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ కలెక్టర్‌ ర్యాంక్‌ ఉద్యోగం రావడం ఆనందంగా ఉందన్నారు. ఆమె తండ్రి శ్రీనివాస్‌ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. తల్లి పద్మప్రియ ఇంటి వద్దే ఉంటారు.

హిందీ పండిట్‌ అయిన తన తాత పి.ఎల్‌.ఎన్‌.శర్మ ప్రోత్సాహంతో గ్రూప్స్‌ చదవి ర్యాంక్‌ సాధించానని సుష్మిత చెప్పారు. తన లక్ష్య సాధనలో తల్లిదండ్రుల పాత్ర ఆమోఘమైందని వెల్లడించారు. బాగా శ్రమిస్తేనే ర్యాంక్‌ సాధించడం సాధ్యమని గ్రూప్స్‌ రాసేవారికి సూచించారు. 10వ తరగతి వరకు పిఠాపురంలో చదువుకున్న సుష్మిత కాకినాడలో బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశారు. హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్లో పీజీ చేశారు. అదే హెల్త్‌కేర్‌లో డాక్టరేట్‌ పూర్తి చేశారు. బెంగళూరులో నివసిస్తున్న ఈమె భర్త రవికాంత్‌ సివిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరికి సురవ్‌ కశ్యప్‌ అనే అబ్బాయి ఉన్నాడు. 

చదవండి: (Rapthadu: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ)

ఏపీపీఎస్సీ పరీక్షల్లో తెలంగాణ అభ్యర్థులు తమ సత్తా చాటారు. నాన్‌ లోకల్‌ కేడర్‌ కింద తెలంగాణ అభ్యర్థులు ఇద్దరు తమ ప్రతిభను చాటుకున్నారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన పవన్‌ డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఐదేళ్లు యూపీఎస్సీ కోసం కష్టం పడ్డా. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు నాన్‌ లోకల్‌ కేడర్‌ కింద ఏపీలో డీఎస్పీగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది’అని అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో సీడీపీవోగా పనిచేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సింధూ ప్రియ కూడా నాన్‌ లోకల్‌ కేడర్‌ కింద డీఎస్పీగా ఎంపికయ్యారు. ఎంపికపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

చదవండి: (మారుమూల రైతు కుటుంబంలో పుట్టి.. లెక్చరర్‌ నుంచి డిప్యూటీ కలెక్టర్‌గా..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top