
ప్రదర్శన నిర్వహిస్తున్న కల్లుగీత కార్మికులు, ఏపీ గౌడ సంఘం నేత చలపాటి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కల్లుగీత వృత్తికి ఊపిరి పోసేలా ప్రభుత్వ కొత్త గీత విధానం ఉందని, గీత వృత్తిదారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కౌండిన్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలపాటి వెంకటేశ్వరరావు చెప్పారు. చలపాటి ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలోని పాతపాడులో సీఎం వైఎస్ జగన్‌కు ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ గీత కార్మికులు మోకు మోస్తాదులతో కృతజ్ఞత ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం చెన్నకేశవస్వామి ఆలయం సెంటర్‌లో సీఎం జగన్, మంత్రి జోగి రమేష్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చలపాటి మాట్లాడుతూ కొత్తగా వైఎస్సార్ గీత కార్మిక భరోసా పథకాన్ని ప్రకటించడంతో పాటు.. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
గౌడ జాతి అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం విజయవాడ నగర అధ్యక్షుడు వీరంకి రామచంద్రరావు, నగర నాయకుడు మాదు సాంబశివరావు, పాతపాడు ఎంపీటీసీ సభ్యుడు మరీదు బాలకోటేశ్వరరావు, సంఘ నాయకులు బెజవాడ ఏడుకొండలు, పలగాని రాంబాయి, పామర్తి శ్రీనివాసరావు, ఆరేపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.