కోవిడ్‌ పరీక్షలు పెంచండి.. | ap govt no response on corona test | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ పరీక్షలు పెంచండి..

Jun 3 2025 5:22 AM | Updated on Jun 3 2025 5:22 AM

ap govt no response on corona test

ప్రభుత్వ మొద్దునిద్రపై ‘సాక్షి’ కథనంతో హడావుడిగా వైద్యశాఖ సమీక్ష

10 రోజుల క్రితమే రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు

సాక్షి, అమరావతి : కొత్త వేరియంట్‌ రూపంలో కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న క్రమంలో నియంత్రణ చర్యలను  చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసిన తీరుపై ‘కరోనా తీవ్రం.. సర్కారు చోద్యం’ శీర్షికతో సోమవారం ‘సాక్షి’లో కథనం రావడంతో వైద్యశాఖ సోమవారం కదిలింది. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సోమవారం హుటా­హుటిన సమీక్ష నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో పరీక్షల సామర్థ్యం పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.

రోజుకు వెయ్యి మందికి పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాధిపతులకు చెప్పారు. పాత జీజీహెచ్‌లలో రోజుకు 100 చొప్పున, కొత్త జీజీహెచ్‌లలో రోజుకు 50 చొప్పున పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటూ..  నెలరోజులకు అవసరమయ్యే కిట్ల­ను అంద­ుబాటులో ఉంచాలని సూచించారు. అలా­గే, వి­వి­ధ రాష్ట్రాల్లో కోవిడ్‌ వ్యాప్తి, రోజువారీ పరీక్షల తీ­రు­ను గమనించాలని చెప్పారు. గత ప­ది రో­జు­లుగా బయటపడ్డ కోవిడ్‌ కేసులను విశ్లేషించా­లన్నా­­రు. ఈ సమీక్షలో వైద్యశాఖ అధికారులు వీరపాండియన్, గిరీశా, డాక్టర్‌ నరసింహం పాల్గొన్నా­­రు.

12 నుంచి 11వ స్థానానికి..
రాష్ట్ర వైద్యశాఖ హడావుడిగా సమీక్ష నిర్వహించి పరీక్షల సామర్థ్యం పెంచాలని ఆదేశించడం చూస్తుంటే.. ఇప్పటివరకు కరోనా పరీక్షలు అంతంతమాత్రంగా చేపట్టినట్లు ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించినట్లయింది. దేశంలో కరోనా వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తుంటే.. రాష్ట్రంలో ఇంకా పరీక్షలు పెంచే యోచనల్లోనే ప్రభుత్వం ఉండడం ఏమిటని.. ఈవెంట్స్‌ మేనేజ్‌మెంట్‌పై చూపుతున్న శ్రద్ధ ప్రజారోగ్యంపై చూపించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు..యాక్టివ్‌ కేసుల్లో ఇప్పటివరకు  దేశంలో 12వ స్థానంలో ఉన్న ఏపీ తాజాగా సోమవారం 11వ స్థానానికి ఎగబాకింది.

Advertisement
 
Advertisement
Advertisement