
సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీల వారీగా బడ్జెట్‌ల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిపై వారంతా కలిసి చర్చించుకుని, అందుబాటులో ఉన్న నిధులతో ప్రణాళికబద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో కూడా నిర్ణయించుకుని బడ్జెట్‌ల రూపకల్పన చేసేలా పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి నెలాఖరులోగా అన్ని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు వేర్వేరుగా బడ్జెట్‌లు రూపొందించుకోవాలంటూ కలెక్టర్లు, డీపీవోలు, జెడ్పీ సీఈవోలను ఆదేశిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు గాను అక్టోబరు 2వ తేదీ నుంచి గ్రామ పంచాయతీల వారీగా ప్రత్యేకంగా గ్రామ సభలను నిర్వహించి.. అక్కడే గ్రామ బడ్జెట్ ప్రణాళికపై చర్చించుకోవాలని సూచించారు.
రూపకల్పన ఇలా..
►గ్రామ పంచాయతీలకు కేటాయించే 15వ ఆర్థిక సంఘం నిధులు, ఇంటి పన్ను, ఇతర పన్నుల రూపంలో సమకూరే ఆదాయంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా ఆయా శాఖల నుంచి గ్రామ పంచాయతీకి అందే అవకాశం ఉన్న నిధులన్నింటినీ అంచనా వేసుకుని.. ఆ మేరకు ఏడాది కాలంలో ప్రణాళికబద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలో ఆ బడ్జెట్‌లో పొందుపరుచుకోవాల్సి ఉంటుంది.
►మండల పరిధిలో ఉండే అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామస్థాయి బడ్జెట్‌ల రూపకల్పన ప్రక్రియ పూర్తి కాగానే.. మండల స్థాయిలో బడ్జెట్ రూపకల్పన చేస్తారు. ఆ తర్వాత జిల్లాల వారీగా బడ్జెట్‌లను రూపొందిస్తారు.
►బడ్జెట్ రూపకల్పనకు నిర్వహించే ప్రత్యేక గ్రామ సభలకు పంచాయతీ, మండల, జెడ్పీ స్థాయిలో వివిధ శాఖల సిబ్బందిని ఆహ్వానిస్తారు.
►గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల వారీగా రూపొందించిన బడ్జెట్ నివేదికలను ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు.