ఏపీ గవర్నర్‌కు కరోనా

AP Governor Vishwa Bhushan Hari Chandan Tested Positive For Covid - Sakshi

ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలింపు

ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల వెల్లడి 

సాక్షి, అమరావతి: ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ వచ్చిన గవర్నర్‌.. రెండు రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో బుధవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ తరలించి ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆధ్వర్యంలో ఆయనకు సీటీ స్కాన్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. అయితే గవర్నర్‌కు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆక్సిజన్‌ స్థాయి సాధారణంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

ఏఐజీ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ 
రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. హైదరాబాద్‌లో గవర్నర్‌కు చికిత్స అందిస్తున్న ఏఐజీ చైర్మన్, సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డితో సీఎం నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడారు. గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top