20 వేల ఎకరాల్లో పచ్చిమేత

AP government support for Dairy farmers - Sakshi

పాడిరైతుకు వెన్నుదన్నుగా రాష్ట్ర ప్రభుత్వం 

ఉపాధిహామీ కింద ఎకరాకు మూడేళ్లలో రూ.77 వేలు

గ్రామ వెటర్నరీ అసిస్టెంట్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ

సాక్షి, అమరావతి: వ్యవసాయానికి అనుబంధంగా పాడిపరిశ్రమను మరింతగా ప్రోత్సహించటంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. పాడి రైతులు పచ్చిమేత (పశుగ్రాసం) పెంచడానికి ఉపాధిహామీ పథకం ద్వారా లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సహాయం చేయనుంది. ఈ ఏడాది దాదాపు 20 వేల ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి ప్రోత్సాహకాలు అందజేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధిశాఖ, పశుసంవర్ధకశాఖ సంయుక్తంగా చేపడతాయి. పశుసంవర్ధకశాఖ లబ్ధిదారులను ఎంపిక చేస్తే, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో పథకం అమలు చేస్తారు. లబ్ధిదారుడు నిర్ణీత పొలంలో మూడేళ్లు పచ్చిమేత పెంచాలి. ఈ మూడేళ్లలో ఉపాధిహామీ పథకం నిధుల నుంచి ఎకరాకు రూ.77,204 వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసే అవకాశం ఉంది. పొలంలో గడ్డి విత్తనాలు చల్లడానికి ముందు భూమిని తయారు చేయడం మొదలు, విత్తనాల కొను గోలు, విత్తడానికి అయ్యే ఖర్చు, ఎరువులు, ఏడాదికి 20 నీటితడులకు అయ్యే ఖర్చు, గడ్డి పెరిగిన తరువాత కోత ఖర్చులతో సహా అన్నింటికి ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తుంది. 

18 సార్లు కోతకొచ్చే పచ్చిమేత
ఒక విడత విత్తితే మూడేళ్ల పాటు పచ్చిగడ్డి వచ్చే విత్తనాలనే లబ్ధిదారుడు వినియోగించాలి. మూడేళ్లలో 18 కోతలపాటు పశుగ్రాసం పాడిరైతుకు అందుబాటులోకి వస్తుంది. తొలి ఏడాది రూ.35,204, మిగిలిన రెండేళ్లు రూ.21 వేల చొప్పున లబ్ధిదారుడికి అందజేస్తారు. ఏ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి అనుమతి ఇవ్వాలన్నది పశుసంవర్ధకశాఖ నిర్ణయిస్తుంది. ఒక్కొక్కరు కనిష్టంగా 25 సెంట్ల నుంచి గరిష్టంగా 2.5 ఎకరాల వరకు పచ్చిమేత పెంపకం చేపట్టేందుకు అనుమతి ఇస్తారు. లబ్ధిదారుడు ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డు కలిగి ఉండాలి.

గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కూడా ఒక్కోచోట గరిష్టంగా 5 ఎకరాల వరకు ప్రభుత్వ భూముల్లో పచ్చిమేత పెంపకానికి ఈ పథకం ద్వారా నిధులు అందజేస్తారు. గ్రామ సచివాలయంలోని పశు సంవర్ధకశాఖ అసిస్టెంట్‌ అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న మహిళల్లో 4.21 లక్షలమంది పాడి పశువుల మీద పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. దీంతో రాష్ట్రంలో పెరిగే పశుసంపద అవసరాలకు తగినట్లు పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top