సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ఖజానా నుంచి అమరావతి కోసం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ఖజానా నుంచి రూ.2,100 కోట్లు సీఆర్‌డీఏకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు అమరావతి కోసం మొత్తం రూ.4,100 కోట్లు ప్రభుత్వ నిధులు విడుదలయ్యాయి.
ఇప్పటికే రాష్ట్ర ఖజానా అప్పుల భారంతో కుదేలైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.47,000 కోట్ల రుణాలు తెచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి నిధులు విడుదల చేయడం ప్రజల డబ్బు వృథా అవుతోందన్న విమర్శలకు దారితీస్తోంది.
గతంలో అమరావతిని ‘సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ’గా అభివర్ణిస్తూ, ప్రజల డబ్బు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టబోమని అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రకటించారు. అయితే ఆ ప్రకటనలకు విరుద్ధంగా ఇప్పటివరకు వేల కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల డబ్బు అమరావతికి పెట్టబోమని చేసిన ప్రకటనలకు విరుద్ధంగా ఇప్పుడు నిధులు విడుదల చేయడంపై ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అప్పుల భారంతో ఉన్న రాష్ట్ర ఖజానా నుంచి అమరావతికి నిధులు కేటాయించడం ఆర్థికపరంగా సరైన నిర్ణయం కాదన్న చర్చలు కొనసాగుతున్నాయి.


