Andhra Pradesh: ఎండిన నదులకు ఎనర్జీ

AP government is ready to revive six rivers in the state - Sakshi

రాష్ట్రంలో ఆరు నదుల పునరుజ్జీవానికి సర్కార్‌ సమాయత్తం

సీమ నాలుగు జిల్లాలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కోటి ఎంపిక

గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ‘ఉపాధి’ నిధులతో భారీ ప్రణాళిక

ఆయా నదుల నదీగర్భం, నది వెంబడి వర్షపు నీటి నిల్వలకు భారీ కార్యక్రమాలు

సబ్‌సర్ఫేస్‌ డ్యామ్‌లు, పెర్కులేషన్‌ ట్యాంకుల నిర్మాణం.. నదీ పరీవాహక ప్రాంతమంతటా పనులు

మూడేళ్ల కాలంలో ఒక్కో నదిపై రూ.50–70 కోట్ల దాకా ఖర్చు

మే నెలలో పనులు ప్రారంభం

‘వ్యక్తి వికాస కేంద్ర’ సంస్థతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఎంవోయూ 

సాక్షి, అమరావతి: ఒకప్పుడు గలగలపారే నీటితో కళకళలాడిన ఎన్నో నదులు ఇప్పుడు వివిధ కారణాలతో ఏడాది పొడవునా ఎడారిని తలపిస్తున్నాయి. చెలమల్లోనూ చుక్కనీటి జాడ కూడా కనిపించని దుస్థితి. ఇలా ఎండిన నదులకు పునరుజ్జీవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. తమిళనాడులోని నాగా నది విషయంలో వచ్చిన సత్ఫలితాల స్ఫూర్తితో ఏపీ సర్కారు కూడా ఈ వినూత్న కార్యక్రమానికి సమాయత్తమైంది. ఇందుకోసం ముందుగా నాలుగు సీమ జిల్లాలతోపాటు ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కో నదిని గుర్తించింది. శ్రీకాకుళం జిల్లాలోని చంపావతి, ప్రకాశంలో గుండ్లకమ్మ, అనంతపురంలో పెన్నా, కర్నూలులో హంద్రీ, వైఎస్సార్‌ జిల్లాలో పాపాగ్ని, చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదిని ఈ కార్యక్రమం కింద ఎంపిక చేశారు. ఉపాధి హామీ పథకం నిధులతో ఈ నదుల పునరుజ్జీవం కార్యక్రమాన్ని  సర్కారు చేపట్టనుంది.

పునరుజ్జీవానికి ఏమి చేస్తారంటే..
నదీ గర్భంలోనూ, నదికి ఇరువైపులా ఉండే ప్రాంతంలో కురిసే వర్షపు నీరు సముద్రంలో కలవకుండా వాటర్‌షెడ్‌ తరహాలో ప్రభుత్వం కట్టడాలు నిర్మిస్తుంది. నదీ గర్భంలోని ఇసుక పొరల కింద నుంచి పారే నీటిని ఎక్కడికక్కడే ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి నది పొడవునా పలుచోట్ల చిన్నచిన్న సబ్‌సర్ఫేస్‌ డ్యామ్‌లు (నది పొరల కింద కట్టేవి) నిర్మిస్తారు. అంటే.. నదీ గర్భంలో గట్టి నేల వచ్చేదాక తవ్వుతారు. అక్కడ బంకమట్టితో కట్ట కడతారు. తర్వాత ఇసుకతో కప్పేస్తారు. దీనివల్ల ఇసుక పొరల్లోంచి ముందుకు పారే నీటికి అడ్డుకట్ట పడుతుంది. నీటి వాలు, నది లోతును బట్టి వీటిని ఎంతెంత దూరంలో నిర్మించాలనేది నిర్ణయిస్తారు.

► అలాగే, నది పుట్టక ప్రాంతం నుంచి.. దాని పరీవాహక ప్రాంతం మొత్తంలో సబ్‌సర్ఫేస్‌ డ్యామ్‌లు, పర్కులేషన్‌ ట్యాంకులను (ఊట చెరువుల మాదిరి) నిర్మించి ఆ చుట్టుపక్కల వాగుల ద్వారా వర్షపు నీటిని నదిలోకి మళ్లిస్తారు. 

► ఒక్కో నది వద్ద సుమారు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ తరహా పనులు చేపట్టే అవకాశముంది.
 
► ఇలా ఒక్కో నది వద్ద మూడేళ్ల పాటు ఈ తరహా కార్యక్రమాలు చేపడతారు. ఈ కాలంలో ఒక్కో దానికి రూ.50–70 కోట్లు ఖర్చుపెట్టే అవకాశముందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. 

మే నుంచి పనులు ప్రారంభం
ఇదిలా ఉంటే.. ఈ ఆరు నదుల వద్ద ఏయే పనులు చేపట్టాలన్న దానిపై ‘వ్యక్తి వికాస కేంద్ర ఇండియా’ సంస్థ నిపుణులు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది కలిసి ఏప్రిల్‌ నెల మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటించి చేపట్టాల్సిన పనులను గుర్తిస్తారు. ఆ తర్వాత మే నుంచే పనుల ప్రారంభించి, వర్షాకాలానికి ముందే కొన్ని ముఖ్యమైన పనులను ఆయా ప్రాంతాల్లో పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వివరించారు.

పాత మ్యాప్‌ల ఆధారంగా చర్యలు
నదుల పునరుజ్జీవం కార్యక్రమంలో భాగంగా ఎండిపోయిన నదుల్లో నీటిని చేర్చడానికి అవకాశం ఉన్న వాగులు, వంకలన్నింటిని అభివృద్ధి చేస్తాం. నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి పాత మ్యాప్‌లను ఆధారంగా చేసుకుని పనులు గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం నిమిత్తం కొన్ని ప్రముఖ సంస్థల నుంచి సాంకేతిక సహాయం తీసుకుంటున్నాం. జలశక్తి అభియాన్‌ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో వారి తోడ్పాటు కూడా ఈ కార్యక్రమానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా పనులు చేపడుతున్న నదుల పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు బాగా పెరిగడం ద్వారా అక్కడ అనేక సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. 
– గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి 

నాగా నది అనుభవంతో..
తమిళనాడులో ఎండిపోయిన నాగా నది పునరుజ్జీవనానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ (ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌)కు చెందిన ‘వ్యక్తి వికాస కేంద్ర ఇండియా’ సంస్థ చేసిన కృషి సత్ఫలితాలివ్వడంతో ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని మెరుగైన ఫలితాల సాధనకు మన రాష్ట్రంలోనూ ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ ప్రక్రియతో అక్కడ సాగు విస్తీర్ణం, నది వెంబడి పచ్చదనం కూడా పెరిగింది. కర్ణాటకలో కూడా మరో నదికి పనిచేసిన అనుభవం ఈ సంస్థకు ఉండడంతో గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు రెండ్రోజుల క్రితం దీనితో ఎంఓయూ కుదుర్చుకున్నారు. నది పునరుజ్జీవం కోసం నదీ గర్భంలోనూ, నదీ పరీవాహకంలో ఎక్కడ ఏ పనులు చేపట్టాలన్నా.. పనుల గుర్తింపు, వాటి పర్యవేక్షణలో ఆ సంస్థ ప్రతినిధుల గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి తోడ్పాటు అందిస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top