AP: జేఏసీ నాయకులకు ఆందోళన ఎందుకు?

AP Government Employees Federation Chairman Venkatramireddy about CM Jagan - Sakshi

నీచ రాజకీయాలు సరికాదు

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్‌ సానుకూలం

ఆర్టీసీ విలీనం, 27 శాతం ఐఆర్‌ సహా చాలా చేశారు.. మిగిలినవి కూడా చేస్తారు

ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి

ఒంగోలు సబర్బన్‌: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సానుకూలంగా ఉన్నారని ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి చెప్పారు. సీఎం మాట ఇచ్చిన తర్వాత కూడా ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. శనివారం ఒంగోలులో జరిగిన ఫెడరేషన్‌ జిల్లా మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత..  హామీలను సరిగ్గా పట్టించుకోవన్నారు. కానీ, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆర్టీసీని విలీనం చేశారని గుర్తు చేశారు. దీన్ని ఏ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమైనా ఊహించిందా అని ఆయన ప్రశ్నించారు.

ఆర్టీసీని విలీనం చేయడం వల్ల ప్రభుత్వానికి రూ.3,600 కోట్లు మేర భారం పడుతుందని నిపుణులు చెప్పినా ‘మాట ఇచ్చాను. విలీనం చేయాల్సిందే’ అని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులు అడగకుండానే 27 శాతం ఐఆర్‌ ఇచ్చారని గుర్తు చేశారు. మిగిలినవి కూడా ఇదేవిధంగా నెరవేరుస్తారని చెప్పారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని తిరుపతిలో ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా ఉద్యోగ జేఏసీ నాయకులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. నీచ రాజకీయాలు సరికాదని సూచించారు. వచ్చే వారం చివరికల్లా పీఆర్సీ పూర్తవుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

సీపీఎస్‌ రద్దు అంశంపై కూడా ముఖ్యమంత్రితో మాట్లాడామని చెప్పారు. బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని బ్లాక్‌ మెయిల్‌ చేసే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇద్దరూ ప్రకాశం జిల్లా వారేనని, దానికి తోడు ఇద్దరూ బంధువులేనని చెప్పారు. రాజకీయాలు కాకుండా.. ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు అరవపాల్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top