Smart Meters: ‘స్మార్ట్‌ మీటర్లపై అపోహలు వద్దు.. అది తప్పుడు ప్రచారం’

AP Energy Department Respond To False Propaganda On Smart Meters - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఏపీ ఎనర్జీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కె.విజయానంద్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విద్యుత్‌ పంపిణీలో అత్యాధునిక విధానాలు ప్రవేశపెడుతున్నామన్నారు. స్మార్ట్‌ మీటర్లపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఐఆర్‌డీఏ మీటర్లకు, స్మార్ట్‌ మీటర్లకు వ్యత్యాసం ఉండదన్నారు. మారుతున్న సాంకేతికని ఇంధనశాఖ అంది పుచ్చుకుంటోందని విజయానంద్‌ అన్నారు.

‘‘ట్రాన్స్‌కోలో ప్రతీ జిల్లాలో 400 ​కేవీ సబ్ స్టేషన్స్ అందుబాటులోకి తీసుకువచ్చాం. వినియోగదారులకి త్వరితగతిన సేవలు అందించడానికే స్మార్ట్ మీటర్లు. స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్  దేశమంతా ఒకేలా ఉంటుంది. మొదటి ఫేజులో 27 లక్షల మీటర్లు‌ స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. ఇందులో 4.72 లక్షలు మాత్రమే గృహావసరాల కనెక్షన్స్ ఉన్నాయి.  అమృత్ సిటీలోని జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో 200 యూనిట్లు దాటిన 4.72 లక్షల కనెక్షన్స్‌కి మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. రాష్ట్రం‌ మొత్తం 1.80 కోట్లు వినియోగదారులు ఉన్నారు. 1.80 కోట్ల కనెక్షన్లకి  స్మార్ట్ మీటర్లనేది అవాస్తవం’’ అని విజయానంద్‌ స్పష్టం చేశారు.

‘‘13.54 లక్షల మందికి సెకండ్ ఫేజులో స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని నిర్ణయిస్తున్నాం. ఇంకా టెండర్లు పిలవలేదు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గుజరాత్ తదితర 15 రాష్ట్రాలు స్మార్ట్ మీటర్లకి టెండర్లు పిలిచాయి. ఏపీ 16వ రాష్ట్రంగా టెండర్లు పిలుస్తోంది. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు ముందుకువచ్చాయి. ఇందుకు కేంద్రం నుంచి 5,484 కోట్లు గ్రాంటుగా వస్తాయి. స్మార్ట్ మీటర్ల ద్వారా వినియోగదారులకి అదనపు భారం పడదు. రైతులకి భారం పడకుండా ప్రభుత్వమే స్మార్ట్ మీటర్ల భారాన్ని భరిస్తోంది’’ అని ఆయన అన్నారు.

‘‘స్మార్ట్ మీటర్ల విషయంలో స్పష్టమైన‌ విధానంతో ఇంధనశాఖ ముందుకు వెళ్తోంది. ఇంధన శాఖకి‌ ఇష్టం లేదనేది అవాస్తవం. అన్ని డిస్కమ్‌లతో చర్చించిన తర్వాతే ఇంధన శాఖ ఈ నిర్ణయం. ఈ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఇంధన వ్యయ వినియోగం నేషనల్ మీటరింగ్ మోనిటరింగ్ సిస్టం పరిధిలోకి వెళ్తాయి. ఇంధన శాఖకి వ్యవసాయ, గృహావసరాల స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్‌పై ఎటువంటి అభ్యంతరాలు లేవు. స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకి ఎక్కువ బిల్లులు వస్తాయనేది అపోహ మాత్రమే’’ అని విజయానంద్‌ వివరించారు.
చదవండి: టీడీపీ నేతల అమానుష చర్య.. చంద్రబాబు సభలో గాయపడిన మహిళకు అవమానం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top