సమాంతర కాలువ తవ్వాకే 'నవలి'పై నిర్ణయం 

AP ENC Narayanareddy To Tungabhadra Board - Sakshi

తుంగభద్ర బోర్డుకు తేల్చిచెప్పిన ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి 

హెచ్చెల్సీకి సమాంతరంగా రోజుకు రెండు టీఎంసీలు 

తరలించేలా వరద కాలువ తవ్వడానికి అనుమతి ఇవ్వాలని ప్రతిపాదన 

తుంగభద్ర జలాశయానికి వరద వచ్చినప్పుడు హెచ్చెల్సీ కోటా నీటిని తరలిస్తామని వెల్లడి 

డీపీఆర్‌లు ఇస్తే అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుందామన్న బోర్డు చైర్మన్‌ డీఎం రాయ్‌పురే  

వాడివేడిగా తుంగభద్ర బోర్డు 217వ సర్వ సభ్య సమావేశం 

సాక్షి, అమరావతి, సాక్షి,బళ్లారి: తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ)కు సమాంతరంగా రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా వరద కాలువను తవ్వాక నవలి రిజర్వాయర్‌ నిర్మాణం అవసరమా? లేదా అనే అంశంపై తేల్చుదామని తుంగభద్ర బోర్డుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్సష్టం చేసింది. నవలి రిజర్వాయర్, సమాంతర కాలువ సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌) ఇస్తే 3 రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నాక చర్చిద్దామని తుంగభద్ర బోర్డు  చైర్మన్‌ డీఎం రాయ్‌పురే చేసిన సూచనకు ఏపీ, కర్ణాటక ఈఎన్‌సీలు సి.నారాయణరెడ్డి, లక్ష్మణబాబు పీష్వా అంగీకరించారు.

తుంగభద్ర జలాశయంలో అనుమతిచ్చిన దాని కంటే అధికంగా 5.045 టీఎంసీలను ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్నట్లు కర్ణాటక సర్కార్‌ అంగీకరించింది. వాటిని తమ రాష్ట్ర కోటా కింద పరిగణించి కోత వేయాలని కర్ణాటక చేసిన ప్రతిపాదనను బోర్డు ఆమోదించింది. ఫిషరీష్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎఫ్‌డీసీ)లో సభ్యత్వం ఇవ్వాలన్న తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ చేసిన ప్రతిపాదనను ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి తోసిపుచ్చారు. తుంగభద్ర బోర్డు నిర్వహణ వ్యయం వాటా నిధులపై ఏడేళ్లుగా తెలంగాణ సర్కార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని బోర్డు  చైర్మన్‌ డీఎం రాయ్‌పురే, ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి ఆక్షేపించారు. బుధవారం విజయనగర జిల్లా టీబీ డ్యాం వద్ద బోర్డు కార్యాలయంలో  చైర్మన్‌ డీఎం రాయ్‌పురే అధ్యక్షతన 217వ సర్వ సభ్య సమావేశం వర్చువల్‌ విధానంలో వాడివేడిగా జరిగింది. 

నవలి అవసరమేముంది? 
తుంగభద్ర జలాశయం సామర్థ్యం 133 టీఎంసీల నుంచి 100.85 టీఎంసీలకు తగ్గిపోవడంతో మూడు రాష్ట్రాలు నష్టపోతున్నాయని కర్ణాటక ఈఎన్‌సీ లక్ష్మణబాబు పీష్వా పేర్కొన్నారు. తగ్గిన సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసేందుకు తుంగభద్ర జలాశయం ఎగువన నవలి వద్ద 30 నుంచి 50 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మిస్తామని, తద్వారా మూడు రాష్ట్రాలు కేటాయించిన మేరకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. రిజర్వాయర్‌ నిర్మాణ వ్యయం రూ.పది వేల కోట్లను మూడు రాష్ట్రాలు దామాషా పద్దతిలో భరించాలని కోరడంపై ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నవలి రిజర్వాయర్‌ నిర్మించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. తుంగభద్ర జలాశయానికి వరద వచ్చే రోజుల్లో రోజుకు రెండు టీఎంసీల చొప్పున తరలించేలా హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ తవ్వడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.  

అక్రమ తరలింపును అంగీకరించిన కర్ణాటక 
తుంగభద్ర జలాశయంలో ఎత్తిపోతల పథకాల ద్వారా 4.34 టీఎంసీలను వాడుకోవడానికి గతంలో కర్ణాటక సర్కార్‌కు బోర్డు అనుమతిచ్చింది. కర్ణాటక సర్కార్‌ అక్రమ ఎత్తిపోతల పథకాల ద్వారా 9.385 టీఎంసీలను తరలిస్తున్నట్లు ఇటీవల బోర్డు నియమించిన జాయింట్‌ కమిటీ సర్వేలో తేలింది. అనుమతి లేకుండా 5.045 టీఎంసీలను తరలిస్తున్నట్లు వెల్లడైంది.

ఈమేరకు బోర్డు సమావేశంలో జాయింట్‌ కమిటీ నివేదికను కార్యదర్శి నాగమోహన్‌ ప్రవేశపెట్టారు. తాగునీటి పథకాలను కర్ణాటక సర్కార్‌ హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ప్రధాన కాలువలపై కాకుండా డిస్ట్రిబ్యూటరీలపై ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి సూచించారు. తాగునీటి పథకాల్లో మార్పులు చేసుకోవాలని కర్ణాటక సర్కార్‌కు బోర్డు సూచించింది. టోపోగ్రాఫికల్‌ సర్వే ప్రకారం తుంగభద్ర జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలుగా పరిగణించి నీటి కేటాయింపులు చేయాలని ఏపీ కోరగా మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు చైర్మన్‌ తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top