ట‘మోత’ తగ్గేలా.. సీఎం జగన్‌ ఆదేశాలతో రంగంలోకి మార్కెటింగ్‌ శాఖ

AP CM YS Jagan Orders Marketing Department To Get Down Tomato Rates - Sakshi

రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రైతుబజార్లలో కిలో రూ.60కే విక్రయం

కృత్రిమ కొరత.. అధిక ధరలకు కళ్లెం

ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి

మదనపల్లె, ములకలచెరువులో అదుపులోకి ధరలు.. వారం రోజుల్లో పూర్తిగా దిగివచ్చే అవకాశం

సాక్షి, అమరావతి: ఠారెత్తిస్తున్న టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో మార్కెటింగ్‌ శాఖ నేరుగా రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయాలు చేపట్టింది.  అనంతపురం, చిత్తూరు మార్కెట్‌ యార్డుల్లో రైతుల నుంచి కిలో రూ.50–55 చొప్పున కొనుగోలు చేసి వైఎస్సార్‌ కడప, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రైతు బజార్ల ద్వారా రవాణా చార్జీలతో కలిపి రూ.60 చొప్పున విక్రయిస్తోంది.

ఒక్కో వినియోగదారుడికి కిలో చొప్పున అందిస్తున్నారు. అవసరమైతే మిగిలిన జిల్లాల్లోనూ విక్రయాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రోజుకు ఏడు నుంచి 10 టన్నుల చొప్పున కొనుగోలు చేస్తుండగా రానున్న రోజుల్లో కనీసం వంద టన్నులు రైతుల నుంచి సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 61,571 హెక్టార్లలో టమాటా సాగవుతుండగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే 56,633 హెక్టార్లలో పండిస్తున్నారు. ఏటా మొత్తం 22.16 లక్షల టన్నుల దిగుబడుల్లో 20.36 లక్షల టన్నులు మూడు జిల్లాల నుంచే వస్తున్నాయి.

సకాలంలో స్పందించడంతో...
గత నెల రోజులుగా భారీ వర్షాలు, వరదలతో టమాటా పంటకు అపార నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం రాయలసీమ జిల్లాల్లోనే 2 వేల హెక్టార్లలో 65 వేల టన్నుల వరకు దెబ్బ తిన్నట్టు అంచనా. దీంతో తీవ్ర కొరత ఏర్పడి టమాటా ధరలు నింగినంటాయి. ఈ పరిస్థితిని గుర్తించి అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి టమాటా కొనుగోలు చేసి వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. సకాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మరో వారం రోజుల్లో టమాటా ధర కిలో రూ.30–40కి దిగి వస్తుందని అంచనా వేస్తున్నారు.

మదనపల్లెలో గ్రేడ్‌ –1 కిలో రూ.52
మదనపల్లె: ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతితో మదనపల్లె వ్యవసాయ కమిటీ మార్కెట్‌లో ధరలు తగ్గాయి. రెండు రోజుల క్రితం గ్రేడ్‌ –1 రకం కిలో రూ.130 పలకగా గురువారం రూ.52కి దిగి వచ్చాయి. చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి పది లారీల టమాటాలు వచ్చాయి. రెండో రకం టమాటా కిలో రూ.10–30 మధ్య ధరలు నమోదయ్యాయి. 

ములకలచెరువులో కిలో రూ.33 మాత్రమే
ములకలచెరువు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా ములకలచెరువు వ్యవసాయ మార్కెట్‌ యార్డులోనూ టమాటా ధరలు భారీగా తగ్గాయి. మొన్నటిదాకా ఇక్కడ 30 కిలోల టమాటా బాక్సు రూ.3 వేల వరకు పలకగా గురువారం రూ.800 నుంచి రూ.1,000 వరకు విక్రయించారు. బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు టమాటాలను తరలించడంతో ధరలు ఒక్కసారిగా తగ్గాయి.

ధరలు నియంత్రించేందుకే..
‘సీజన్‌ ఆరంభంలో ధరలేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వేలం పాటల్లో పాల్గొని వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేసింది. ధరల నియంత్రణకు రైతుల నుంచి నేరుగా టమాటా కొనుగోలు చేపట్టి విక్రయిస్తున్నాం’ – పి.మధుసూదనరెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, మార్కెటింగ్‌ శాఖ 

వారం రోజుల్లో అదుపులోకి..
‘వర్షాలు, వరదల వల్ల పంటలు దెబ్బతినడం, కార్తీకమాసం కారణంగా డిమాండ్‌ వల్ల టమాటా ధర పెరిగింది. ప్రభుత్వ చర్యలతో రానున్న వారం రోజుల్లో ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయి’ -బి. శ్రీనివాసరావు, రైతుబజార్ల సీఈవో 
 
  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top