AP CM YS Jagan Key Announcement On Pension In Kuppam Meeting - Sakshi
Sakshi News home page

జనవరి నుంచి పింఛన్‌ రూ.2,750

Sep 23 2022 3:50 PM | Updated on Sep 24 2022 7:51 AM

AP CM YS Jagan Key Announcement On Pension In Kuppam Meeting - Sakshi

కుప్పం అనిమిగానిపల్లి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పెన్షన్‌ రూ.2500 కూడా ఈ జనవరి నుంచి రూ.2,750లకు పెంచుతున్నామని ప్రకటించారు.

కుప్పం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రస్తుతం రూ.2,500 చొప్పున ఇస్తున్న అవ్వాతాతల పింఛన్‌ను వచ్చే జనవరి నుంచి రూ.2,750కి పెంచబోతున్నామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రూ.3 వేల వరకు తీసుకుపోతామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కుప్పంలో వైఎస్సార్‌ చేయూత పథకం మూడో విడత నిధుల జమ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఈ ఏడాది అందిస్తున్న రూ.4,949.44 కోట్లతో కలిపి ఈ పథకం కింద ఇప్పటి దాకా  మొత్తం రూ.14,110.62 కోట్ల ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. మూడు విడతలలో కలిపి ఒక్కొక్కరికీ  ఇప్పటికే రూ.56,250 అందజేశామన్నారు. అత్యంత బాధ్యతాయుతమైన 45–60 ఏళ్ల మధ్య ఉన్న అక్క చెల్లెమ్మలు కుటుంబాన్ని ఒక బాధ్యతతో మోస్తున్నారని.. వాళ్ల చేతిలో డబ్బులు పెడితే ఆ కుటుంబం ఎదుగుతుందని విశ్వసించామన్నారు. 60 ఏళ్లు నిండిన వారు పెన్షన్‌ జాబితాలోకి వెళ్లిపోతారని, కొత్తగా 45 ఏళ్లు నిండిన వారు ఈ పథకంలోకి చేరుతారని చెప్పారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

అమ్మ కడుపులో బిడ్డ మొదలు అవ్వ వరకు..
అమ్మ కడుపులోని బిడ్డ మొదలు అవ్వ వరకు అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అక్కచెల్లెమ్మల సాధికారతే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందు కేసింది. అమ్మ ఒడి, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, పొదుపు సంఘాల వైఎస్సార్‌ సున్నా వడ్డీ.. ఈ నాలుగు పథకాల ద్వారానే కేవలం 39 నెలల్లో ఈ ప్రభుత్వం రూ.51 వేల కోట్లు ఇచ్చింది.

అమ్మ ఒడి ద్వారా 44.5 లక్షల మందికి రూ.19,617 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ ఆసరా ద్వారా 78.74 లక్షల మందికి రెండు విడతల్లో రూ.12,757 కోట్లు ఇప్పటికే ఇచ్చాం. మూడో దఫా జనవరి నెలలో ఇవ్వనున్నాం.  చేయూత ద్వారా 26.4 లక్షల మందికి రూ.14,111 కోట్లు, సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.3,615 కోట్లు ఇచ్చాం. ఇందులో ఎక్కడా లంచాలు, వివక్షకు తావే లేదు. మొత్తంగా ఈ 39 నెలల్లో అన్ని రకాల పథకాల ద్వారా బటన్‌ నొక్కి మహిళలకు అందించిన సొమ్ము రూ.1,17,667 కోట్లు. అన్న దమ్ములకు కూడా ఇచ్చింది కలుపుకుంటే రూ.1.71 లక్షల కోట్లు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలన్నీ అమలు చేస్తున్నాం.

ఆరు నాన్‌ డీబీటీ పథకాలైన ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న తోడు ద్వారా ఇచ్చిన రూ.1.41 లక్షల కోట్లు  కలుపుకుంటే.. మొత్తం రూ.3,12,764 కోట్లు. ఇందులో అక్కచెల్లెమ్మలకే రూ.2.39 లక్షల కోట్లు నేరుగా లబ్ధి చేకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం. 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తి ఇచ్చినట్టు అవుతుంది. ఇళ్ల ద్వారా అక్క చెల్లెమ్మలకు రూ.2.3 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చినట్టు అవుతుంది. 
చదవండి: కుప్పం అంటే ఇప్పుడు అభివృద్ధి: సీఎం జగన్‌ 

చేయూతతో 5.82 లక్షల మందికి ఆర్థిక సాధికారత 
వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ప్రభుత్వం అందజేసే డబ్బుతో చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలా? జీవనోపాధికి వాడుకోవాలా? అన్నది పూర్తిగా మహిళల నిర్ణయానికే వదిలేశాం. అయితే, చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి సాంకేతిక, బ్యాంకుల పరంగా మార్కెటింగ్‌ పరంగా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. 

కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారికి ఐటీసీ, హిందుస్థాన్‌ లీవర్, ప్రాక్టర్‌ అండ్‌ గాంబెల్, రిలయన్స్‌ లాంటి కార్పొరేట్‌ కంపెనీలతో టై అప్‌ చేశాం. మార్కెటింగ్‌లో శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకులతో రుణాలు అందించేలా చేస్తున్నాం. ప్రతి అక్కా, చెల్లెమ్మ రూ.7 వేల నుంచి రూ.10 వేలు ప్రతినెలా ఆదాయం పొందడానికి మార్గాన్ని చూపిస్తున్నాం. 

ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల కొనుగోలుకు సహకరిస్తున్నాం. వీరిని ప్రోత్సహించేందుకు అమూల్‌ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. గతంలో కన్నా కనీసం లీటర్‌ పాలకు రూ.5–15 ఎక్కువ రేటుకు అమూల్‌ సంస్థ కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమూల్‌ రంగ ప్రవేశం చేశాక ఇప్పుడు హెరిటేజ్‌ సంస్థ కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితి కూడా వచ్చింది. వైఎస్సార్‌ ఆసరా, చేయూత ద్వారా అందిన డబ్బుతో 1.10 లక్షల మంది మహిళలు కిరాణా దుకాణాలు పెట్టారు. మరో 60,995 మంది వస్త్ర వ్యాపారం చేసుకుంటున్నారు. 2.96 లక్షల మంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు పెంచుకుంటూ సంపాదిస్తున్నారు. 1.15 లక్షల మంది ఇతర జీవనోపాధి మార్గాల్లో ఉపాధి పొందుతున్నారు. మొత్తం 5,82,662 మంది ఆర్థిక సాధికారత సాధించడానికి వైఎస్సార్‌ చేయూత పథకం ఉపయోగపడింది. 

అప్పుడు, ఇప్పుడు అదే బడ్జెట్‌
ఇంతకు ముందు పరిపాలనలో ముఖ్యమంత్రి ఉన్నారు. అప్పుడూ, ఇప్పుడూ అదే బడ్జెట్‌. అప్పుడు చేసిన అప్పుల కన్నా, ఇప్పుడు చేసిన అప్పులు తక్కువే. కానీ అప్పటి ప్రభుత్వంలో ఇంతగా లబ్ధి ఎందుకు జరగలేదు.. ఇప్పుడు ఎలా జరుగుతోంది.. మీరే ఆలోచించండి. è ఆ రోజుల్లో దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్ధతి ఉండేది. కేవలం నలుగురు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు.. వారికి తోడు గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఉండేవి. అప్పుడు ప్రజలకు డబ్బు పోయేది కాదు. ఇవాళ బటన్‌ నొక్కుతున్నాం.. నేరుగా మీ (లబ్ధిదారుల) ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement