ఆరోగ్య సేవలకు రూ.3,200 కోట్లు: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

AP CM YS Jagan Increased YSR Aarogyasri Treatments From 2446 To 3254 - Sakshi

3,254కి పెరగనున్న ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్య  

ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్య సిబ్బంది ఉండేలా ప్రతి నెలా ఆడిట్‌ 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైట్‌ చార్జీ రూ.100

కొత్త వైద్య కళాశాలల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి  

సాక్షి, అమరావతి: డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్సల సంఖ్యను త్వరలో 2,446 నుంచి 3,254కు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ, అనుబంధ సేవలకు ఏటా రూ.3,200 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.

గత సర్కారు హయాంతో పోలిస్తే మూడు రెట్లు అదనంగా ఖర్చు చేస్తున్నామని, ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని చెప్పారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వైద్య శాఖలో నియామకాలు, ఆరోగ్యశ్రీలో చికిత్సల పెంపు, కొత్త వైద్య కళాశాలల నిర్మాణం సహా పలు కార్యక్రమాల్లో పురోగతిని పరిశీలించారు. 

మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
ఆరోగ్యశ్రీ పథకం కోసం ఏటా రూ.2,500 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం సుమారు రూ.300 కోట్లు, 108 అంబులెన్స్‌లు, 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల (ఎంఎంయూ) కోసం మరో రూ.400 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మొత్తంగా ఏటా రూ.3,200 కోట్లు ఆరోగ్యశ్రీ, అనుబంధ సేవలకు వెచ్చిస్తున్నాం. వచ్చే డిసెంబర్‌ నాటికి 104 ఎంఎంయూ కొత్త వాహనాలు 432 అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటికే 676 వాహనాల ద్వారా గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్నాం. కొత్త  వాహనాలతో ఎంఎంయూల సంఖ్య 1,108కి పెరుగుతుంది. వీటికి తోడు 108 అంబులెన్స్‌లు 748 ఉన్నాయి. 104, 108 వాహనాల నిర్వహణ, ఆరోగ్యశ్రీ పథకం అమలులో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే మన లక్ష్యం. 

12 వైద్య పరీక్షలు.. 67 రకాల మందులు
గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 12 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు 67 రకాల మందులు పుష్కలంగా అందుబాటులో ఉండాలి. కరోనా నిర్ధారణ కిట్‌లు కూడా సమకూర్చాలి.

ప్రతి నెలా ఆడిట్‌ 
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరత సమస్య తలెత్తడానికి వీల్లేదు. వేల సంఖ్యలో వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ చేపట్టాం. ప్రతి చోటా సరిపడా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. దీనిపై ప్రతి నెలా ఆస్పత్రుల వారీగా ఆడిట్‌ నిర్వహించాలి. ఆడిట్‌ నివేదికలు ప్రతి నెలా ఉన్నతాధికారులకు చేరాలి. నివేదికలు పరిశీలించి ఎక్కడైనా ఖాళీ ఉంటే తక్షణమే వేరొకరిని నియమించాలి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు యోచన చేయాలి. జూనియర్‌ డాక్టర్‌లకు స్టైఫండ్‌ పెంపుపై చర్యలు తీసుకోవాలి.

డైట్‌ చార్జీలు రూ.100
ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మంచిమెనూతో ఆహా రం అందించాలి. డైట్‌చార్జీని రోజుకు రూ.100కు పెంచాలి. మంచి మెనూతో డైట్‌ సమకూర్చాలి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 17 కొత్త వైద్యకళాశాలలను నిర్మిస్తున్నాం. సకాలంలో వీటి నిర్మాణాలు పూర్తయ్యేలా దృష్టి సారించాలి.

15 నుంచి ప్రారంభం!
ఆరోగ్యశ్రీలో కొత్తగా చేర్చే చికిత్సలను దాదాపు ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కొన్ని సంప్రదింపుల దృష్ట్యా కొత్తగా చేర్చిన చికిత్సలను అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాన్ని అక్టోబర్‌ ఐదో తేదీ నుంచి 15వ తేదీకి వాయిదా వేసినట్లు వెల్లడించారు. అదే రోజు ‘ఫ్యామిలీ డాక్టర్‌’ పైలట్‌ ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తామన్నారు. వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం వచ్చే నవంబర్‌ నెలాఖరుకు పూర్తవుతుందని చెప్పారు.

సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ సమీర్‌శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు కృష్ణబాబు, ముద్దాడ రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, సీఎఫ్‌డబ్ల్యూ నివాస్, డీఎంఈ, ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ వినోద్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్, డ్రగ్‌ కంట్రోల్‌ డీజీ రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రానికి ఆరు అవార్డులు
ప్రజలకు డిజిటల్‌ వైద్య సేవలు అందించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందచేసిన అవార్డులను సమీక్ష అనంతరం సీఎం జగన్‌ తిలకించారు. ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ కార్యక్రమంలో ఉత్తమ పనితీరుకు జాతీయ స్థాయిలో 10 అవార్డులు ఇవ్వగా ఆరు రాష్ట్రానికే దక్కాయని మంత్రి రజిని, అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన సీఎం జగన్‌ వారిని అభినందించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top