గిరిజనుల అభ్యున్నతికి సీఎం కృషి

AP CM YS Jagan Dedicated For Betterment Of Tribals Says Minister Rajanna Dora - Sakshi

బీచ్‌ రోడ్డు (విశాఖ తూర్పు): గిరిజనుల అభ్యున్నతికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న దొర చెప్పారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ గిరిజనుల అభ్యున్నతిని పట్టించుకోలేదని, సీఎంగా జగన్‌ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వారి తలరాతలు మారాయని తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విశాఖలో నేషనల్‌ ట్రైబల్‌ డ్యాన్స్‌ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలను శుక్రవారం రాత్రి ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి పోరాడిన మహనీయుల చరిత్రతో కూడిన మ్యూజియాన్ని రూ.35 కోట్లతో లంబసింగిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పర్యాటకులకు సంస్కృతి, సంప్రదాయాలు తెలిపేలా కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నామన్నారు. దేశం నలు మూలల నుంచి 14 రాష్ట్రాల గిరిజనులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాలు వేరైనా అందరం ఒకటేనన్నారు. మూడు రోజులు పాటు సాగే ఈ ఫెస్టివల్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజనులు వారి రాష్ట్రాల సంస్కృతీ, సంప్రదాయాలు తెలిపేలా నృత్యాలు ప్రదర్శించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, కళావతి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top