ఉవ్వెత్తున ‘ఉపాధి’

Andhra Pradesh Tops In Employment Guarantee Scheme Works - Sakshi

సాక్షి, అమరావతి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో పేదలకు పనులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్‌ ఈ ఏడాది కూడా ఇప్పటివరకు దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, బిహార్‌ తరువాత స్థానాల్లో నిలిచాయి. ఉపాధి హామీ పథకం ప్రధాన ఉద్దేశం గ్రామాల్లో పేదల వలసలను నివారించడం, వ్యవసాయ పనులు లేని వేసవి సీజన్‌లో సొంతూరిలో పనులు కల్పించడం. ఈ క్రమంలో ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల రోజుల్లోనే రాష్ట్రంలో 2,84,03,576 పనిదినాల పాటు ప్రభుత్వం పేదలకు పనులు కల్పించింది. మధ్యప్రదేశ్‌ నెల రోజుల వ్యవధిలో 2.06 కోట్ల పనిదినాలు కల్పించగా తెలంగాణ 1.65 కోట్లు, బిహార్‌ 1.48 కోట్ల పనిదినాలను కల్పించగలిగాయి. ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ రాష్ట్రాలు పేదలకు తాజాగా కల్పించిన పనిదినాల వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. 

నెలలో 17.07 కోట్ల పనిదినాలు
► దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈ నెల రోజుల వ్యవధిలో 17.07 కోట్ల పనిదినాలను కల్పించగా రూ.4,288 కోట్లు పేదలకు కూలీగా చెల్లించారు. ఏపీలో 20.01 లక్షల కుటుంబాలకు చెందిన 29.84 లక్షల మంది పేదలు పనులకు హాజరై రూ.474.98 కోట్లు వేతనాల రూపంలో పొందారు. పనులకు హాజరైన వారిలో 60.04 శాతం మంది మహిళలే ఉన్నారు. 
► వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎండల వల్ల కూలీలు ఇబ్బంది పడకుండా ఉదయమే 6.30 నుంచి పనులకు వీలు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో పనులకు హాజరయ్యేలా ఉదయం, సాయంత్రం రెండు పూటలా వీలు కల్పించారు.
► పనులకు వచ్చే పేదలు రోజువారీ ఎక్కువ మొత్తంలో కూలీ గిట్టుబాటు అయ్యే విధంగా వీలున్న సమయంలో నిర్దేశిత పనులు చేసేందుకు అవకాశం ఉంది. గ్రామాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు రోజులో చేయాల్సిన పనులను ముందే మార్కు చేసి ఉంచుతారు. 
► గత నెల రోజులుగా రాష్ట్రంలో ఉపాధి పథకం పనులకు హాజరయ్యే కూలీలకు సరాసరిన రోజుకు రూ.181.58 చొప్పున వేతనం అందుతోంది.
► వేసవిని దృష్టిలో పెట్టుకొని గత రెండేళ్ల పాటు ఏప్రిల్, మే, జూన్‌లో 20 – 30 శాతం తక్కువ పనిచేసినా నిర్ణయించిన కూలీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అయితే ఈ విధానానికి కేంద్రం అభ్యంతరం తెలపడంతో ప్రస్తుత ఏడాది అమలులో లేదు. దీంతో గతంతో పోల్చితే కూలీ నామమాత్రంగా తగ్గింది.  
► ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోజూ 16–17 లక్షల మంది పేదలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. రోజు రోజుకూ ఇది పెరుగుతోంది. గత నెల రోజుల్లో 2.84 కోట్ల పని దినాలను కల్పించగా అందులో కోటి పనిదినాలు దాకా గత వారం రోజుల్లో జరిగినవేనని అధికారులు వెల్లడించారు. 

తండాలకు ‘ఉపాధి’ అండ 
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం సుంకరమెట్ట పంచాయతీ పరిధిలోని జనంగూడ తండాకు చెందిన డంబున్‌ నాయుడు కుటుంబం ఉపాధి హామీ పనులకు వెళ్లి నెల రోజుల్లో రూ.13,620 సంపాదించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి మే 1 వరకు ఆ కుటుంబంలో ముగ్గురు సభ్యులు 66 పనిదినాలను పొందారు. ఇదే పంచాయతీ పరిధిలోని వివిధ తండాలలో నివసించే 481 కుటుంబాలు ఉపాధి పనులకు వెళ్లి కూలీ కింద రూ.16.02 లక్షలు వేతనం పొందాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top