‘మామిడి’లో మనమే ఘనం

Andhra Pradesh top is mango growing state in the country - Sakshi

దేశంలోనే ముందంజలో రాష్ట్రం 

ఏపీలో హెక్టారుకు సగటున 12 టన్నుల ఉత్పత్తి  

జాతీయ సగటు 9.6 టన్నులు   

మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా రైతులకు మేలు, నిరుద్యోగులకు ఉపాధి   

అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయన నివేదికలో వెల్లడి 

సాక్షి, అమరావతి : దేశంలో అత్యధికంగా మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. అలాగే జాతీయ స్థాయి సగటు హెక్టార్‌కు మామిడి ఉత్పాదకతను మించి రాష్ట్రంలో సగటు హెక్టార్‌కు మామిడి ఉత్పాదకత అత్యధికంగా ఉంది. దేశంలో ఏపీ తర్వాత మామిడి ఉత్పత్తిలో ఒడిశా రాష్ట్రం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలో మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మేలుతో పాటు  ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొరియా ఇంటర్నేషనల్‌ కో–ఆపరేషన్‌ ఏజెన్సీ సహకారంతో ఈ అధ్యయనం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఆహార ప్రాసెసింగ్‌ రంగంలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేశారు.  

నివేదికలో ఉన్న ముఖ్యాంశాలు 

 • జాతీయ స్థాయిలో హెక్టార్‌కు సగటున 9.6 ట­న్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా, ఏపీలో  హెక్టార్‌కు సగటున 12 టన్నులు ఉత్పత్తి అవుతోంది. 
 • ఒడిశాలో హెక్టార్‌కు సగటున 4 నుంచి 6.3 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. 
 • ఏపీలో ఉత్పత్తయ్యే మామిడి పండ్లలో 16% ఫ్రూట్‌ ప్రాసెస్‌ చేపడుతున్నారు. ఇలా ప్రాసెస్‌ చేసిన ఉత్పత్తుల డిమాండ్‌ను పెంచాల్సి ఉంది.
 • ఏపీలో బంగినపల్లి, సువర్ణ రేఖ, నీలం, తోతాపురి రకాలు ఎక్కువగా పండుతుండగా, ఎగుమతికి అనువైన ఇమామ్‌ పసంద్, బంగినపల్లి, సువర్ణరేఖ వంటి గుజ్జు రకాలూ ఎక్కువగానే పండుతున్నాయి.  
 • ఏపీలో ఉత్పత్తి అయ్యే గుజ్జు రకాల పండ్లలో దాదాపు 54 శాతం ఎగుమతి అవుతున్నాయి. ప్రాసెస్‌ చేసిన పండ్ల ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉంది.
 • గుజ్జు రకాల మామిడి పండ్ల ఉత్పత్తి ఏపీ, ఒడిశాలో అత్యధికంగా ఉంది. పండ్ల ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా అధిక ఉద్యోగాలు కల్పించవచ్చు. పండ్ల ప్రాసెసింగ్‌ పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది.  
 • ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో కీలకమైన పరిమితులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నాణ్య­మైన ముడి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. 
 • ప్రభుత్వ పథకాలను అందుబాటులో ఉంచడంతో పాటు త్వరగా అనుమతులివ్వాలి. పండ్ల ప్రాసెసింగ్‌లో 75 శాతం మహిళలకు, 25 శాతం పురుషులకు ఉపాధి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3.39 మిలియన్‌ ఎంఎస్‌ఎంఈలను ఉండగా, ఒడిశాలో 1.98 మిలియన్‌ ఎంఎస్‌ఎంఈలున్నా­యి. ఈ రెండు రాష్ట్రాల ఎంఎస్‌ఎంఈల్లోనే 111 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. 
 • నమోదైన ప్రాసెసింగ్‌ యూనిట్ల కన్నా ఏపీ, ఒడిశాల్లో నమోదుకాని యూనిట్లు 26 నుంచి 80 రెట్లు ఉంటాయి. 
 • ఏపీ ప్రభుత్వం 2020–25 లక్ష్యంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విధానాన్ని తెచ్చింది.. కొత్త సాంకేతిక బదిలీలను ప్రోత్సహించడం, సాంకేతికతను అప్‌గ్రేడేషన్‌ చేయడం, ముడి సరుకు సక్రమంగా సరఫరా అయ్యేలా సరైన పంటల ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయ ప్రాసెసింగ్‌ క్లస్టర్లు ఏర్పాటు చేయడం.యువతకు వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఇంక్యుబేషన్‌ కేంద్రాల ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు తదితరాలతో బ్యాక్‌వర్డ్‌ లింక్‌లను ఏర్పరచుకోవడం వంటివి లక్ష్యంగా విధానాన్ని రూపొందించుకుంది. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top