బందరు పోర్టుకు లైన్‌క్లియర్‌

Andhra Pradesh High Court Shock To Navayuga On Bandar Port - Sakshi

అడ్డుకునేందుకు యత్నించిన ‘నవయుగ’కు హైకోర్టులో మళ్లీ చుక్కెదురు

ప్రభుత్వాన్ని నియంత్రించే ఉద్దేశంతో సంస్థ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లు కొట్టివేత 

పోర్టు నిర్మాణ పనులను ఇతరులకు అప్పగించకుండా ఆదేశాలివ్వలేం 

ఒప్పందం రద్దు ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయలేం.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అమలునూ ఆపలేం 

ఒప్పందంలోని బాధ్యతలను ‘నవయుగ’ నిర్వర్తించలేదు 

మొత్తం భూమిని ఒకేసారి అప్పగించాలని ఒప్పందంలో ఎక్కడా లేదు.. ప్రభుత్వ ప్రతిపాదనను ఆ సంస్థే తిరస్కరించింది 

ప్రభుత్వం సహకరించలేదన్న ‘నవయుగ’ వాదన ఎంతమాత్రం సరికాదు 

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ

తదుపరి విచారణ డిసెంబర్‌లో చేపడతామన్న ధర్మాసనం  

సాక్షి, అమరావతి: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మచిలీపట్నం (బందరు) పోర్టుకు ఎదురైన అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. తాజాగా గురువారం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. వచ్చే నెలలో ముఖ్యమంత్రి దీనికి శంకుస్థాపన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టు వ్యవహారంలో నవయుగ పోర్టు లిమిటెడ్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురు కావడమే ఇందుకు కారణం. మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు ‘నవయుగ’ సంస్థ దాఖలు చేసిన మూడు అనుబంధ పిటిషన్లనూ హైకోర్టు గురువారం నిర్ద్వందంగా తోసిపుచ్చింది.

పోర్టు నిర్మాణ పనులను ఇతరులెవ్వరికీ అప్పగించకుండా ఆదేశాలివ్వాలంటూ ఆ సంస్థ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌నూ కొట్టేసింది. అలాగే, తమతో ఒప్పందం రద్దుచేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్‌ జడ్జి తీర్పు అమలును నిలుపుదల చేయాలన్న అనుబంధ పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది. అంతేకాక.. ఒప్పందం రద్దుచేసుకుంటూ ప్రభుత్వం జారీచేసిన జీఓ–66, ప్రాజెక్టును పీపీపీ నుంచి ఈపీసీ విధానంలోకి మారుస్తూ జారీచేసిన జీఓ–9 అమలును నిలుపుదల చేయాలంటూ దాఖలుచేసిన అనుబంధ పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టేసింది.

ఈ పోర్టు నిర్మాణం విషయంలో యథాతథస్థితి ఉత్తర్వులతో సహా నవయుగ కోరిన విధంగా ఏ రకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యంకాదని హైకోర్టు తేల్చిచెప్పింది. టెండర్‌ ఖరారు, లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ జారీ, లోయస్ట్‌ బిడ్డర్‌ ఒప్పందం కుదుర్చుకోవడం వంటి విషయాల్లో ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని స్పష్టంచేసింది. పోర్టు నిర్మాణంపై ముందుకెళ్లే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్న నవయుగ వాదనలనూ తోసిపుచ్చింది.

ఇక రాష్ట్ర ప్రభుత్వం 2,360 ఎకరాల భూమిని అప్పగించేందుకు సిద్ధమైనా కూడా నవయుగ తిరిగి కొత్త షరతులను విధిస్తూ వచ్చిందని హైకోర్టు ఆక్షేపించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్‌ జడ్జి తీర్పుపై దాఖలైన అప్పీల్‌ను డిసెంబర్‌ మొదటి వారంలో తదుపరి విచారణ జరుపుతామని తెలిపింది.

సింగిల్‌ జడ్జి తీర్పుపై నవయుగ అప్పీల్‌
నవయుగ పోర్ట్‌ లిమిటెడ్‌తో ఒప్పందం రద్దు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సింగిల్‌ జడ్జి సమర్థిస్తూ గత నెల 25న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ధర్మాసనం ముందు ‘నవయుగ’ అప్పీల్‌ చేసింది. దీంతోపాటు పోర్టు నిర్మాణ పనులను ఇతరులెవ్వరికీ అప్పగించకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు చేయడంతో పాటు సింగిల్‌ జడ్జి తీర్పు అమలును, ఒప్పందం రద్దు ఉత్తర్వుల జీఓ అమలును నిలిపేయాలని కోరుతూ మూడు అనుబంధ పిటిషన్లు దాఖలు చేసింది.

వీటిపై విచారణ జరిపిన జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ధర్మాసనం ఈ నెల 20న మధ్యంతర ఉత్తర్వుల జారీపై తన నిర్ణయాన్ని రిజర్వ్‌చేసింది. తాజాగా గురువారం తన నిర్ణయాన్ని వెలువరించింది. 

అప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది 
‘ఒప్పందం రద్దును సమర్థిస్తూ సింగిల్‌ జడ్జి తీర్పునివ్వగా రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత లోయస్ట్‌ బిడ్డర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇతరులెవ్వరికీ అప్పగించకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలన్న నవయుగ అభ్యర్థనను మన్నించలేకున్నాం. ఇక పోర్టు కొత్త మోడల్‌ ప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని 830 ఎకరాలకు కుదించారు.

అలాగే, ప్రాజెక్టు వ్యయాన్ని రూ.700 కోట్లకు తగ్గించారు. అందువల్ల జీఓ–9 అమలు నిలుపుదల సాధ్యంకాదు. జీఓ–66 సంగతికొస్తే, సింగిల్‌ జడ్జి ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాతే నవయుగ పిటిషన్‌ను కొట్టేశారు. అందువల్ల దాని అమలును నిలుపుదల చేయలేం’.. అని ధర్మాసనం తేల్చిచెప్పింది. 

మొత్తం భూమిని ఒకేసారి ఇవ్వాలని ఎక్కడాలేదు...
‘2008లో ఒప్పందం కుదిరినప్పటికీ, ఎప్పటికప్పుడు అవసరమైన భూమిని అప్పగిస్తూ వచ్చినప్పటికీ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే మొత్తం భూమిని ఒకేసారి ఇవ్వాలన్న నిబంధనలు ఎక్కడా కనిపించలేదు. పైగా.. ఒప్పందంలోని బా«ధ్యతలను నిర్వర్తించడంలో రాయితీదారు (నవయుగ) విఫలమైతే ఆ ఒప్పందాన్ని రద్దుచేసుకోవచ్చునని ఒప్పందంలో స్పష్టంగా ఉంది.

ఇక పోర్టు అభివృద్ధి కోసం 2,360 ఎకరాలతోపాటు మరో 519 ఎకరాల అసైన్డ్‌ భూమిని అప్పగించేందుకు  ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే, ఈ ప్రతిపాదనను నవయుగ తిరస్కరించింది. 5,324 ఎకరాలను ఒకేసారి ఇవ్వాలని పట్టుబట్టింది. వీటన్నింటి దృష్ట్యా మొత్తం భూమిని ఒక్కసారే ఇవ్వలేదు కాబట్టి ప్రాజెక్టును చేపట్టలేదన్న నవయుగ వాదనను ఆమోదించలేకున్నాం. 

పరస్పర విరుద్ధంగా ‘నవయుగ’ లేఖలు
‘నిజానికి.. 2019 ఏప్రిల్‌లో పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖల్లో ప్రాథమిక పనులను మొదలుపెట్టినట్లు నవయుగ చెప్పింది. అయినప్పటికీ నవయుగ ముందుకెళ్లలేదు. అంతేకాక.. నవయుగ రాసిన లేఖలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ప్రాథమిక ఆధారాలను బట్టి నవయుగ బాధ్యతలను నిర్వర్తించలేదు. పైపెచ్చు కొత్త షరతులు విధిస్తూ వచ్చింది.

అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్న నవయుగ వాదనను తోసిపుచ్చుతున్నాం. సింగిల్‌ జడ్జి తీర్పులో వ్యక్తంచేసిన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం. వీటన్నింటి దృష్ట్యా నవయుగ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేస్తున్నాం’.. అని ధర్మాసనం స్పష్టంచేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top