సెలవులకు ముందు అరెస్ట్‌ పరిపాటిగా మారింది | Andhra pradesh High Court Serious on YSRCP Leader Tambireddy Illegal Arrest | Sakshi
Sakshi News home page

సెలవులకు ముందు అరెస్ట్‌ పరిపాటిగా మారింది

Apr 3 2026 6:20 AM | Updated on Apr 3 2026 6:20 AM

Andhra pradesh High Court Serious on YSRCP Leader Tambireddy Illegal Arrest

వైఎస్సార్‌సీపీ నేత తంబిరెడ్డి అక్రమ అరెస్టు విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

గత 35 ఏళ్లుగా ఇలాంటివి చూస్తూనే ఉన్నాం.. సోషల్‌ మీడియా యాక్టివిస్టుల మీద పోలీసుల తీరుపై ఆగ్రహం

వీరి అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సిందే

తంబిరెడ్డి నిర్బంధం కిడ్నాప్‌లానే ఉంది

పోలీసులు ఇలాగే చేస్తుంటే ఇల్లీగల్‌ కేసు పెట్టాల్సి వస్తుంది

పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు ధర్మాసనం ఆదేశం  

సాక్షి, అమరావతి/టాస్క్ ఫోర్స్‌: తిరుపతిలో కలకలం రేపిన వైఎస్సార్‌సీపీ నేత తంబిరెడ్డి అక్రమ అరెస్టు విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్బంధం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. సోషల్‌ మీడియా యాక్టివిస్టులను సెలవులకు ముందు అరెస్ట్‌ చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని వ్యాఖ్యానిస్తూ, ఈ విధానాన్ని ‘‘హైడ్‌ అండ్‌ సీక్‌’’ ఆటతో పోలి్చంది. ఇది ఒక్క కేసుకు పరిమితం కాకుండా అనేక కేసుల్లో జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

అరెస్టు తేదీని దాచిపెట్టి నిన్ననే అరెస్టు చేశాం.. అంటారా? అంటూ  తంబిరెడ్డి అరెస్ట్‌ విషయంలో ప్రశి్నంచింది.  ఇది వ్యక్తిగత హక్కులను దెబ్బతీస్తుందని పేర్కొంది. పోలీసులు ఇలాగే చేస్తుంటే ఇల్లీగల్‌ కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది.  అక్రమ నిర్బంధంపై హెబియస్‌ కార్పస్‌ వేసినప్పుడు మాత్రమే.. కేసులు పెట్టి అరెస్ట్‌లు చూపిస్తున్నారని తెలిపింది. గత 35 సంవత్సరాలుగా ఇలాంటివి చూస్తూనే ఉన్నామని పేర్కొంది. 

సోషల్‌ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని పోలీసులను ఆదేశించింది. రెండేళ్ల క్రితం కేసుకు సంబంధించి ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకుడు, 60 ఏళ్ళ వృద్ధుడు తంబి రెడ్డి నిర్బంధంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్‌ రెడ్డి , జస్టిస్‌ హరిహరనాథ శర్మ ధర్మాసనం.. ఆయన అరెస్ట్‌పై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.  

తంబిరెడ్డి విడుదల.. పోలీసులకే మంచిది 
‘తంబిరెడ్డిని విడుదల చేయాలని లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడం లేదు. మౌఖికంగా ఈ విషయా­న్ని చెబుతున్నాం. తంబిరెడ్డిని విడుదల చేయడం పోలీసు­లకే మంచిది. ఏం జరిగిందన్న దానిపై చాలా స్ప­ష్టత ఉంది. ఇలాంటి విషయాల్లో మొండిగా వెళితే ఇ­బ్బంది పడేది పోలీసులే.   

పిటిషనర్‌ వాదనలు 
తన తండ్రి తంబిరెడ్డిని గత నెల 31న గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతంగా తీసుకెళ్లారని , ఇప్పటి వరకు ఆయన జాడ తెలియలేదని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ నితిన్‌ రెడ్డి హైకోర్టులో అత్యవసర హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వెంకటేష్‌ ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ, ‘పోలీసులు తంబిరెడ్డి ని అక్రమంగా నిర్బంధించారు. దీనిపై తాము తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు అదృశ్యం కేసు నమోదు చేశారు. 

హైకోర్టులో తాము ఈ పిటిషన్‌ దాఖలు చేసిన తరువాత గుంటూరు అరండల్‌ పేట పోలీసులు ఫోన్‌ చేసి తంబి రెడ్డిని సోషల్‌ మీడియాలో పోస్టులపై అరెస్ట్‌ చేశామని పిటిషనర్‌ నితిన్‌ రెడ్డికి చెప్పారు. సోషల్‌ మీడియా కేసుల్లో 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్షే ఉన్నప్పటికీ,  పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు’ అని వివరించారు.  వివరాలను తెలపడానికి సమయం ఇవ్వాలని పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది టి.విష్ణుతేజ చేసిన విజ్ఞప్తి మేరకు విచారణ సోమవారానికి వాయిదా పడింది.   

హైకోర్టు ఆదేశించినా మారని పోలీసుల తీరు 
తంబిరెడ్డి అరెస్టును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టి, విడుదల చేయాలని చెప్పినా.. గుంటూరు పోలీసుల తీరు మారలేదు. గురువారం రాత్రి గుంటూరు జిల్లా జడ్జి ముందు ఆయనను హాజరుపరిచారు. అయితే న్యాయమూర్తి కేసు వివ­రాలను పరిశీలించి, రిమాండ్‌ను తిరస్కరించారు. హైకో­ర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా తన వద్దకు నిందితుడిని తీసుకురావడం పట్ల సదరు న్యాయమూర్తి పోలీసులను మందలించినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement