పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే.. చూస్తూ ఊరుకోం | Andhra Pradesh High Court Fires On AP Police Over Social Media Activists Illegal Arrests, More Details | Sakshi
Sakshi News home page

పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే.. చూస్తూ ఊరుకోం

Published Wed, Mar 12 2025 4:31 AM | Last Updated on Wed, Mar 12 2025 9:46 AM

Andhra Pradesh High Court Fires On AP police

రుజువులు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్‌ చేస్తారా?

ఎలా పడితే అలా అరెస్ట్‌ చేస్తామంటే కుదరదు: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం  

పోలీసులు చట్టం కంటే ఎక్కువని భావిస్తున్నారు 

పౌరుల స్వేచ్ఛను తేలిగ్గా తీసుకునే చర్యలను ఆమోదించబోం 

చిన్న తప్పులే కదా అని వదిలేస్తే.. రేపు కోర్టుల్లోకొచ్చి మరీ అరెస్ట్‌లు చేస్తారు 

అంతా బాగుందని చెబితే మౌనంగా ఉంటామనుకోవద్దు 

మేజిస్ట్రేట్‌లు సైతం యాంత్రికంగా రిమాండ్‌లు విధిస్తున్నారు 

సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ అవుతు శ్రీధర్‌రెడ్డి రిమాండ్‌ చట్ట విరుద్ధం 

సెక్షన్‌ 47(1) ప్రకారం పోలీసులు నడుచుకోలేదు 

ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం

ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. 
నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు.
స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కూడా కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడటం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి కూడా వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది.
– ప్రొఫెసర్‌ జావీద్‌ అహ్మద్‌ హజమ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రెడ్‌ బుక్‌ రాజ్యాంగంలో.. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో.. చట్టాలను కాలరాస్తూ.. ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ.. పౌరుల స్వేచ్ఛను హరిస్తూ ఎడాపెడా అక్రమ అరెస్టులకు బరి తెగిస్తున్న ఖాకీలపై హైకోర్టు కన్నెర్ర చేసింది..! ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీల అధినేతలను విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు అడ్డగోలుగా కేసులు బనాయించడంపై నిప్పులు చెరిగింది. 

సోషల్‌ మీడియా యాక్టివిస్టులకు బెయిల్‌ రాకుండా చేసేందుకు ఉద్దేశపూర్వకంగా బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 కింద కేసులు బనాయించటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం బలవంతపు వసూళ్ల కిందకు వస్తుందా? అని పోలీసులను నిలదీసింది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్‌లు చేస్తున్నా... మేజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్‌ విధిస్తుండటాన్ని కూడా తప్పుబట్టింది. 

పోలీసులు చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ చట్టానికి లోబడే నడుచుకోవాలని మందలించింది. ఊహల ఆధారంగా ఇష్టానుసారంగా అరెస్టులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే.. రేపు కోర్టులోకి వచ్చి అరెస్టులు చేయడానికి కూడా వెనుకాడరని ఘాటుగా వ్యాఖ్యానించింది.

భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి.ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియచేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి. 
– ప్రొఫెసర్‌ జావీద్‌ అహ్మద్‌ హజమ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి: టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ సోషల్‌ మీడి­యాలో పోస్టులు పెట్టినందుకు సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ అవుతు శ్రీధర్‌రెడ్డికి కింది కోర్టు రిమాండ్‌ విధించడం చట్ట విరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. ఈమేరకు రిమాండ్‌ ఉత్తర్వులను రద్దు చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, డాక్టర్‌ జస్టిస్‌ కుంభజడల మన్మథరావుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. తీర్పు కాపీ అందిన వెంటనే శ్రీధర్‌రెడ్డిని విడుదల చేయాలని నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను ధర్మాసనం ఆదేశించింది. 

న్యాయమా?.. అన్యాయమా? అన్నదే ముఖ్యం...
ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవుతు శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌ విషయంలో పోలీసులు అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఎలాంటి రుజువులు లేకుండా పోలీసులు తమ ఊహ ఆధారంగా అరెస్ట్‌లు చేస్తామంటే కుదరదని పేర్కొంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఆరెస్టులు చేస్తూ పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. 


మేజిస్ట్రేట్‌లు సైతం ఏమీ చూడకుండా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యక్తులు ఎవరన్నది తమకు ముఖ్యం కాదని, పోలీసులు చర్యలు న్యాయమా? అన్యాయమా? అన్నదే ముఖ్యమని తేల్చి చెప్పింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ చట్టానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 



పౌరుల హక్కులను, స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందంది. పౌరుల స్వేచ్ఛను తేలిగ్గా తీసు­కునే చర్యలను తాము ఎంత మాత్రం అనుమతించబోమంది. చట్టాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదని పోలీసులకు తేల్చి చెప్పింది. ఎలా పడితే అలా అరెస్టులు చేసి మేజిస్ట్రేట్‌ల ముందు హాజరుపరు­స్తామంటే చూస్తూ ఊరుకునేది లేదంది. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. 

చిన్న తప్పులే కదా అని వదిలేస్తే, రేపు కోర్టులోకి వచ్చి అరెస్టులు చేయడానికి కూడా వెనుకాడరని వ్యాఖ్యానించింది. అంతా బాగుందని చెప్పేస్తే, తాము మౌనంగా ఉండిపో­తామని అనుకోవద్దని పోలీసులకు తేల్చి చెప్పింది. శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి హాజరుపరిచినప్పుడు మొదట మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ తిరస్కరించారని, దీంతో ఆయన్ను స్వేచ్ఛగా వదిలేయాల్సిన పోలీసులు మళ్లీ అరెస్ట్‌ చూపారని పేర్కొంది. 

మేజిస్ట్రేట్‌ సైతం రిమాండ్‌ రిపోర్ట్‌లోని అంశాలను లోతుగా పరిశీలించకుండా శ్రీధర్‌రెడ్డికి రిమాండ్‌ విధించారని ధర్మాసనం ఆక్షేపించింది. ప్రతీ దశలోనూ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారంది. శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌ విషయాన్ని సైతం సరైన పద్ధతిలో సంబంధీకులకు తెలియచేయలేదని ప్రస్తావించింది. రిమాండ్‌ రిపోర్టును పరిశీలిస్తే బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 47(1) కింద అరెస్ట్‌ విషయాన్ని తెలియచేయలేదని తెలిపింది. 

అందువల్ల శ్రీధర్‌రెడ్డి నిర్భంధం అక్రమమని ధర్మాసనం తేల్చి చెప్పింది. సెక్షన్‌ 47(1) ప్రకారం అరెస్ట్‌ విషయాన్ని నిర్భంధంలో ఉన్న వ్యక్తికి వెంటనే తెలియచేసి తీరాల్సి ఉంటుందని పేర్కొంది. శ్రీధర్‌రెడ్డిని హాజరుపరిచినప్పుడు సెక్షన్‌ 47(1) ప్రకారం అరెస్ట్‌కు గల కారణాలను నిందితునికి తెలియచేయలేదన్న కారణంతో మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ను తోసిపుచ్చారు. సెక్షన్‌ 47(1) పోలీసులు చట్టం నిర్ధేశించిన విధి విధానాలను పాటించని పక్షంలో నిందితుడిని స్వేచ్ఛగా వదిలేయాలని చట్టం చెబు­తోంది. 

ఈ కేసు విషయానికి వస్తే పోలీ­సులు చట్టపరమైన విధి విధానాలను పాటించక­పోయినా కూడా నిందితుడికి మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించారు. తద్వారా మేజిస్ట్రేట్‌ యాంత్రికంగా వ్యవ­హరిం­చారు. అందువల్ల శ్రీధర్‌రెడ్డి రిమాండ్‌ చట్ట విరు­ద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు రిమాండ్‌ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే శ్రీధర్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొన­సాగించుకోవచ్చునని పోలీసులకు సూచించింది.

రిమాండ్‌పై భార్య న్యాయ పోరాటం
తన భర్త అవుతు శ్రీధర్‌రెడ్డికి రిమాండ్‌ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమంటూ ఎం.ఝాన్సీ వాణిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ రఘునందన్‌రావు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున పాపిడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపించగా ప్రభుత్వం తరఫున యతీంద్ర దేవ్‌ వాదనలు వినిపించారు.

రీల్‌ పోస్టు చేయడం.. బలవంతపు వసూలా?
సాక్షి, అమరావతి: సోషల్‌ మీడియా యాక్టివిస్టులకు బెయిల్‌ రాకుండా చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 కింద కేసులు బనాయించటాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ తీరును వ్యంగ్యంగా చిత్రీకరించి ఫేస్‌బుక్‌లో సదరు రీల్‌ను పోస్ట్‌ చేసిన మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్‌పై బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కేసు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. 

సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం బలవంతపు వసూళ్ల కిందకు వస్తుందా? అని పోలీసులను నిలదీసింది. ప్రేమ్‌ కుమార్‌ పోస్ట్‌ చేసిన రీల్‌కు, బలవంతపు వసూళ్లకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించింది. ఆయన బలవంతపు వసూళ్లకు పాల్పడటంతో పాటు తరచూ నేరాలు చేసే వ్యక్తి అని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొనడంపై మండిపడింది. దేని ఆధారంగా ఇలా రాశారంటూ నిలదీసింది. 

అరెస్ట్‌ సమయంలో ఆయన వద్ద రూ.300 దొరికాయి కాబట్టి వాటిని బలవంతపు వసూళ్లుగా చెబుతున్నారా? అంటూ మండిపడింది. మేజిస్ట్రేట్లు కూడా యాంత్రికంగా రిమాండ్‌ విధించేస్తున్నారంది. రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు ఏం పేర్కొన్నారు? అందులో పేర్కొన్న సెక్షన్లు నిందితునికి వర్తిస్తాయా? లాంటి విషయాలను లోతుగా పరిశీలించకుండానే రిమాండ్‌ విధించేస్తున్నారని పేర్కొంది. 

రొటీన్‌గా రిమాండ్‌ ఉత్తర్వులు..
తమ ముందుకు వస్తున్న కేసులను పరిశీలిస్తే మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారనే  విషయం స్పష్టంగా కనిపిస్తోందని హైకోర్టు పేర్కొంది. మేజిస్ట్రేట్లు రొటీన్‌గా రిమాండ్‌ ఉత్తర్వు­లిచ్చేస్తున్నారంది. మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నా, తాము మాత్రం బుర్రలు ఉపయోగించే విచారణ జరుపుతు­న్నా­మని వ్యాఖ్యానించింది. 

నిందితుడిని అరెస్ట్‌ చేసే సమయంలో అతడు ఎక్కడ ఉంటే అక్కడి పంచాయితీదారుల సమక్షంలోనే జర­గాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ప్రేమ్‌కుమార్‌ అరెస్ట్‌ విష­యంలో కర్నూలు పోలీసులు అక్కడ పంచాయతీదారులను గుంటూరుకి తీసుకురావడంపై హైకోర్టు ఒకింత విస్మయం వ్యక్తం చేసింది. 

ఇలా చేయడానికి చట్టం అనుమతిస్తోందా? అని నిలదీసింది. ప్రేమ్‌కుమార్‌ వ్యంగ్యంగా నాటక రూపంలో ఓ రీల్‌ చేసి పోస్టు చేశారని, ఇందులో బలవంతపు వసూళ్ల అంశం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. ఇలాంటి తీరును ఎంత మాత్రం సహించేది లేదని, ప్రేమ్‌కుమార్‌ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కేసు పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారో పోలీసులు చెప్పి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. 

దీనికి సంబంధించి కర్నూలు త్రీ టౌన్‌ ఎస్‌హెచ్‌వో అఫిడవిట్‌ దాఖలు చేయడంతో పాటు తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమయంలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి జోక్యం చేసుకుంటూ, జిల్లా ఎస్పీని సైతం అఫిడవిట్‌ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, మిగిలిన ప్రతివాదులు కూడా కౌంటర్లు దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చని పేర్కొంటూ విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. 

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, డాక్టర్‌ జస్టిస్‌ కుంభజడల మన్మథరావు ధర్మా­సనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి ప్రేమ్‌­కుమార్‌ను కర్నూలు పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు జారీ చేయా­లని అభ్యర్థిస్తూ కొరిటిపాటి అభియన్‌ గత ఏడాది హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్‌ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా మరోసారి విచారించింది.

సెక్షన్‌ 111 ఏ సందర్భంలో పెట్టొచ్చంటే...
కిడ్నాపింగ్, దొంగతనం, వాహన దొంగతనం, బలవంతపు వసూళ్లకు పాల్పడం, కాంట్రాక్ట్‌ కిల్లింగ్, ఆర్థిక నేరాలు, సైబర్‌ నేరాలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఇతర అక్రమ వస్తువులను కొనుగోలు చేయడం, అమ్మడం వంటి వాటికి పాల్పడిన వారికి మాత్రమే సెక్షన్‌ 111 వర్తిస్తుంది. ఈ నేరాలు రుజువైతే మరణశిక్ష, జీవితఖైధు, రూ.10 లక్షలకు తగ్గకుండా జరిమానా విధించవచ్చు. 

సోషల్‌ మీడియా పోస్టులు ఈ నేరాల కిందకు రాకపోయినప్పటికీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆ పోస్టులను వ్యవస్థీకృత నేరంగా చూపుతూ సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై సెక్షన్‌ 111 కింద కేసులు బనాయిస్తున్నారు. బెయిల్‌ రాకుండా చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారు. ప్రస్తుత కేసులో కూడా పోలీసులు ప్రేమ్‌కుమార్‌పై బలవంతపు వసూళ్ల కింద కేసు పెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement