AP: జీతాలు, పింఛన్లకు మనకే ఖర్చెక్కువ

Andhra Pradesh Govt Spending More Amount On Salaries Pensions Compare To Other States - Sakshi

 2021–22 తొలి ఏడు నెలల్లోనే వేతనాలకు రూ.24,681.47 కోట్లు

ఇదే సమయంలో పెన్షన్ల కోసం రూ.11,324 కోట్లు ఖర్చు

ఈ కాలంలో గుజరాత్‌లో వేతనాలు, పింఛన్లకు రూ.16,053 కోట్లు

బిహార్‌లో వేతనాలు, పింఛన్ల కోసం రూ.25,567.5 కోట్లు

తెలంగాణలో వేతనాల వ్యయం రూ.17,005.11 కోట్లు

‘కాగ్‌’ నివేదికలో వెల్లడి

పెద్ద రాష్ట్రాలు, అధిక ఆదాయ రాష్ట్రాలకన్నా ఇక్కడే ఎక్కువ వ్యయం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కన్నా రాబడి బాగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు సైతం.. తమ ఉద్యోగుల జీతభత్యాలపై ఇక్కడికన్నా తక్కువే వెచ్చిస్తున్నాయి. భౌగోళికంగా ఏపీ కన్నా పెద్ద రాష్ట్రాల్లోనూ జీతభత్యాల వ్యయం ఇక్కడికన్నా తక్కువే ఉంది. సాక్షాత్తూ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నెలవారీ గణాంకాలు దీన్ని వెల్లడించాయి. 2021–2022 తొలి ఏడు నెలల గణాంకాలను (ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు) విడుదల చేస్తూ... ఈ ఏడు నెలల్లో జీతాలు, పెన్షన్ల వ్యయం దాదాపు రూ.36వేల కోట్లకు పైగా అయిందని, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్‌ వంటి పెద్ద రాష్ట్రాల్లో కానీ... గుజరాత్, తెలంగాణ వంటి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కానీ ఈ స్థాయి వ్యయాలు కాలేదంటూ  గణాంకాలను బయటపెట్టింది. 

ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ఒక పక్క కరోనాతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. గడిచిన రెండేళ్లలో దాదాపు 22వేల కోట్ల ఆదాయం తగ్గిపోగా... కోవిడ్‌ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్య రక్షణపై రూ.8వేల కోట్లు అదనంగా వెచ్చించాల్సి వచ్చింది. ఇలా రూ.30వేల కోట్లను కోవిడ్‌ మహమ్మారి మింగేసినప్పటికీ... ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లను చెల్లిస్తూ వస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 2021–22 ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు వేతనాలు, పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.36,006.11 కోట్లు వెచ్చించింది.

ఇందులో వేతనాల రూపంలో 24,681.47 కోట్లు ఖర్చు చేయగా పెన్షన్ల కింద రూ.11,324.64 కోట్లు వెచ్చించింది.  ఇటీవల 11వ వేతన సవరణ కమిషన్‌ నివేదికపై సీఎస్‌ నేతృత్వంలోని అధికారుల కమిటీ కూడా రాష్ట్రంలో వేతనాల వ్యయం చాలా ఎక్కువగా ఉందని తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆ కమిటీ రాష్ట్ర సొంత ఆదాయం కన్నా వేతనాలు వ్యయం ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రతీ ఐదేళ్లకోసారి వేతన సవరణను రాష్ట్రం భరించలేదని కూడా కీలకమైన వ్యాఖ్య చేసింది. అందుకు తగినట్లుగానే ఈ ఆర్ధిక ఏడాది వేతనాల వ్యయంపై కాగ్‌ గణాంకాలు కూడా ఉండటం గమనార్హం. ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వం వేతనాల రూపంలో రూ.3500 కోట్లకు పైగా చెల్లిస్తోంది. పెన్షన్ల రూపంలో మరో 1500 కోట్లకు పైగా ప్రతీ నెల చెల్లిస్తోంది. రాష్ట్రంలో ప్రతీ ఏటా వేతనాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతూనే ఉంది.  

  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top