బొట్టు బొట్టుకూ లెక్క | Andhra Pradesh govt constantly calculating arrival and consumption of water | Sakshi
Sakshi News home page

బొట్టు బొట్టుకూ లెక్క

Jan 3 2022 5:14 AM | Updated on Jan 3 2022 2:29 PM

Andhra Pradesh govt constantly calculating arrival and consumption of water - Sakshi

వరదను ఒడిసి పట్టి.. పొదుపుగా వాడుకోవడం ద్వారా జలవనరులను సంరక్షించుకోవడానికి ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది.

సాక్షి, అమరావతి: వరదను ఒడిసి పట్టి.. పొదుపుగా వాడుకోవడం ద్వారా జలవనరులను సంరక్షించుకోవడానికి ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. వర్షపాతం, అంతర్రాష్ట్ర నదుల ద్వారా వచ్చే ప్రవాహాన్ని.. ఆవిరి, కడలిలో కలుస్తున్న జలాలు, సాగు, గృహ, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకుంటున్న నీరు.. ప్రాజెక్టుల్లో, చెరువుల్లో, భూగర్భంలో లభ్యతగా ఉన్న నీటి లెక్కలను రోజూ లెక్కిస్తోంది. తద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి.. జలవనరులను సమర్థవంతంగా పరిరక్షిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ వాటర్‌ రీసోర్సెస్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌)ను ఏర్పాటుచేసింది. అంతేకాదు.. జలసంరక్షణలో అత్యుత్తమంగా పనిచేస్తున్నందుకు ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

నీటి లెక్కలు ఇలా..
ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1తో ప్రారంభమై మార్చి 31తో ముగుస్తుంది. కానీ, నీటి సంవత్సరం ఏటా జూన్‌ 1న ప్రారంభమై మే 31తో ముగుస్తుంది. నీటి లెక్కలను కూడా జూన్‌ 1 నుంచి లెక్కిస్తారు. అది ఎలాగంటే..
► రాష్ట్రంలో రోజూ కురిసే వర్షాన్ని రెయిన్‌ గేజ్‌ల ద్వారా కొలుస్తున్నారు.

► అంతర్రాష్ట్ర నదుల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించే నీటిని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హైడ్రలాజికల్‌ అబ్జర్వేషన్‌ సెంటర్లలో ఏర్పాటుచేసిన గేజ్‌ల ద్వారా లెక్కిస్తుంది. ఇదే రీతిలో కడలిలో కలిసే జలాలను లెక్కిస్తుంది.

► ఆవిరయ్యే నీటిని ఎవాపరీమీటర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లెక్కిస్తుంది.

► ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు విడుదల చేసే నీటిని.. తాగు, గృహ, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకునే నీటిని టెలీమీటర్ల ద్వారా గణిస్తారు. 

► ఫీజియోమీటర్ల ద్వారా భూగర్భంలో ఇంకే నీటిని లెక్కిస్తుంది. 
..ఇలా రాష్ట్రంలో రెయిన్‌ గేజ్‌ల నుంచి ఫీజియోమీటర్ల వరకూ అన్నింటినీ ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్‌తో అనుసంధానం చేసింది. జూన్‌ 1 నుంచి మే 31 వరకూ రోజూ నీటి రాక, పోకను లెక్కించి.. లభ్యతగా ఉన్న నీటి వివరాలను వెల్లడిస్తుంది. 


7,994.32 టీఎంసీల ప్రవాహం..
రాష్ట్రంలో ఈ ఏడాది సగటున 855 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని అంచనా వేశారు. కానీ, ఇప్పటికే 977.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీని ద్వారా 5,476.39 టీఎంసీల ప్రవాహం వచ్చింది. గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార తదితర అంతర్రాష్ట్ర నదుల ద్వారా రాష్ట్రంలోకి ఇప్పటివరకూ 2,517.93 టీఎంసీల ప్రవాహం వచ్చింది. అంటే.. ఆదివారం నాటికి రాష్ట్రంలోకి మొత్తం 7,994.32 టీఎంసీల ప్రవాహం వచ్చింది. ఇందులో ఆదివారం నాటికి ఆవిరి రూపంలో 2,829.9 టీఎంసీలు ఖర్చయ్యాయి.

ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, గొట్టా బ్యారేజీ, నారాయణపురం ఆనకట్ట ద్వారా గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి జలాలు 2,780.6 టీఎంసీలు కడలిలో కలిశాయి. అంటే.. అంతర్రాష్ట్ర నదుల ద్వారా రాష్ట్రంలోకి వచ్చిన ప్రవాహం కంటే 262.23 టీఎంసీలు అధికంగా సముద్రంలో కలిసినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు.. సాగు, తాగు, గృహ, పారిశ్రామిక అవసరాల కోసం ఇప్పటిదాకా 780.15 టీఎంసీలే వాడుకోవడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement