
మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: విజయవాడ నడిబొడ్డున 206 అడుగుల బీఆర్ అంబేడ్కర్ మహావిగ్రహం రూపకల్పనతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో విశ్వకర్మగా చరిత్రలో నిలిచిపోతారని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అభివర్ణించారు. దేశ చరిత్రలోనే మహాఘట్టంగా నిలిచిపోయే అంబేడ్కర్ మహా విగ్రహం ఆవిష్కరణ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా జరగనుందని, ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు అంబేడ్కర్ సిద్ధాంతాలకు అభిమానించే వారు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన సుమారు 1.50 లక్షల మంది హాజరుకానున్నారని పేర్కొన్నారు.
’సామాజిక న్యాయ మహాశిల్పం’ ఆవిష్కరణ, సామాజిక సమతా సంకల్ప సభ కార్యక్రమాల ఏర్పాట్లను పార్టీ నాయకులతో కలిసి విజయసాయిరెడ్డి గురువారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా లేనివిధంగా రూపొందించిన ఈ మహా శిల్పం నుంచి జీవకళ ఉట్టిపడుతోందన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించే వారిలో దేశంలోనే ముందుండే సీఎం జగన్ అధికారంలోకి వచ్చి కేవలం నాలుగున్నరేళ్ల కాలంలోనే దళితుల కలను సాకారం చేశారన్నారు. ఈ మహా విగ్రహం సీఎం జగన్‌కు బడుగు, బలహీన వర్గాల మీద ఉన్న ప్రేమాభిమానాలను ప్రతిబింబిస్తోందన్నారు.
అంబేడ్కర్ స్మృతివనం దేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా అవతరించనుందని చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మ్యూజియంలో అంబేడ్కర్ బాల్యం, విద్యాభ్యాసం, ఇతర ఘట్టాలకు సంబంధించి చిత్రాల్లో జీవం ఉట్టిపడుతోందన్నారు. విజయసాయిరెడ్డి వెంట మంత్రులు మేరుగు నాగార్జున, కె.నారాయణస్వామి, జోగి రమేష్, ఎంపీలు నందిగం సురేష్, కేశినేని నాని, మాజీ మంత్రులు సుచరిత, వెలంపల్లి శ్రీనివాస్, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేత దేవినేని అవినాశ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment