
కనిగిరిలో సాయంత్రం 6 గంటలకు 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు
ఈశాన్య దేశాల్లో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం
మరో 3 రోజులు ఇదే పరిస్థితి
సాక్షి, విశాఖపట్నం: వేసవి కాలంలో సాయంత్రమైతే కాస్త చల్లబడేది. కానీ.. వర్షాకాలం వచ్చేసినా భానుడు భగ్గుమంటున్నాడు. ఈశాన్య దేశాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా.. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా జూలై నెలలో పొడి వాతావరణం ఏర్పడుతోంది. ఫలితంగా రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాదాపు 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు పగటి పూట నమోదవుతుండటంతో.. నడి వేసవిలో ఉన్నామా అన్న రీతిలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
సాయంత్రం 6 గంటలు దాటినా భానుడి ప్రతాపం కొనసాగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో కనిగిరిలో 39.9 డిగ్రీలు, ఇంకొల్లులో 39.4, ఒంగోలులో 39.2, జువి్వగుంటలో 39, అక్కంపేట, జలదంకి (నెల్లూరు), వినుకొండలో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే తరహా ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.