
సాక్షి, అమరావతి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జూన్ 27 నుంచి జూలై 4వ తేదీ వరకు స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి త్యాగాన్ని చాటి చెప్పేలా వేడుకలు ఉంటాయన్నారు.
ఉత్సవాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని, పాండ్రంగిలోని అల్లూరి మెమోరియల్ మ్యూజియం, పార్కుతో పాటు అల్లూరి విగ్రహాన్నీ ఆవిష్కరిస్తారని, అక్కడే స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను సత్కరిస్తారని వివరించారు. వేడుకల్లో భాగంగా రోజూ సాయంత్రం సంగీత విభావరి, సురభి నాటికలు, దేశభక్తిని పెంపొందించేలా కళా ప్రదర్శనలుంటాయని తెలిపారు.
విద్యార్థులకు వక్తృత్వం, వ్యాస రచన, చిత్రలేఖనం, రంగోలి, లఘు చిత్రాలు, పాటలు–నృత్య పోటీలు, అల్లూరి పోరాటాన్ని గుర్తు చేసేలా ప్రత్యేక ఏకపాత్రాభినయ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ప్రజలకు అవగాహన కల్పించేలా ఊరేగింపులు, సైకిల్ ర్యాలీలు, రక్తదాన శిబిరాలు, యోగా, ఫొటో గ్యాలరీ, 125 అడుగుల జాతీయ జెండా ప్రదర్శనలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు.