వక్ఫ్‌బోర్డును రబ్బర్ స్టాంప్‌గా మార్చేసి చంద్రబాబు సర్కార్ ఇష్టారాజ్యం
ప్రభుత్వ కార్యాలయాలకు వక్ఫ్‌భూముల కేటాయింపు
ఇందుకు అనుగుణంగా ఆమోదాలకు వక్ఫ్‌బోర్డ్‌పై ఒత్తిళ్లు
పరిరక్షణ బాధ్యతను విస్మరించి భూములను లాక్కొనే కుతంత్రాలు
తాజాగా నంద్యాల జిల్లాలో పలు కార్యాలయాలకు 19.14 ఎకరాలు
నేడు వక్ఫ్‌బోర్డు సమావేశంలో ఆమోదానికి రంగం సిద్ధం
సర్కార్ విధానాలపై విస్తుపోతున్న ముస్లిం సమాజం
సాక్షి, అమరావతి: ముస్లిం సమాజం మేలు కోసం దాతలు ఇచ్చిన రూ.వందల కోట్ల విలువైన వక్ఫ్ భూములను అధికారికంగా కొల్లగొట్టేందుకు చంద్రబాబు సర్కారు అడ్డూ అదుపులేకుండా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోందని ముస్లిం సమాజం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. వక్ఫ్‌బోర్డును రబ్బర్ స్టాంప్‌గా మార్చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు భూముల కేటాయింపునకు ఆమోదముద్ర వేసేలా వక్ఫ్‌బోర్డ్ సమావేశాల్లో ఒత్తిడి తెస్తూ ఇష్టంవచ్చినట్లు వ్యవహరిస్తోందని ముస్లిం ప్రతినిధులు విమర్శిస్తున్నారు.
నంద్యాల జిల్లాలో వక్ఫ్ భూములను పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఆర్మ్‌డ్ రిజర్వ్ కార్యాలయాల కోసం కేటాయించే విషయాన్ని మంగళవారం నిర్వహిస్తున్న ఏపీ వక్ఫ్‌బోర్డు సమావేశం అజెండా అంశాల్లో చేర్చడం ముస్లిం సమాజంలో తాజాగా తీవ్ర చర్చనీయాంశమైంది. నంద్యాల జిల్లాలోని చాబోలు గ్రామంలో సర్వే నెంబర్ 313/1లోని 19.14 ఎకరాల వక్ఫ్‌భూమిని జిల్లా ఎస్పీ కార్యాలయం, పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఆర్మ్‌డ్ హెడ్ క్వార్టర్స్ కోసం కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రతిపాదించారు. దీన్ని వక్ఫ్‌బోర్డు చైర్మన్, అధికారులు పరిశీలించి 11వ అంశంగా అజెండాలో చేర్చారు. అదే జిల్లాలోని పాణ్యం మండలం కౌలుర్ గ్రామంలోని సర్వే నెంబర్ 128/2లో పది సెంట్ల భూమిని కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం అప్పగించేలా అజెండాలోని 12వ అంశంగా చేర్చారు. దీనిపై వక్ఫ్‌బోర్డు సభ్యులు చర్చించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ముస్లిం సమాజం గమనిస్తోంది.
అడిగేవారే లేరనుకునే ధోరణి
రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వ భూములను సహజంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రభుత్వమే భూ సేకరణ చేసి ఆయా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి వినియోగించడం జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇందుకు సంబంధించి ముస్లిం సమాజానికి చెందిన వక్ఫ్ భూములపై కన్నేసింది. పైగా ఆయా వ్యవహారాల్లో అధికార పార్టీ నాయకుల జోక్యం కూడా పెచ్చుమీరింది. రాష్ట్రంలో అనేక వక్ఫ్ భూములను ఏపీఐఐసీ తదితర సంస్థలకు కట్టబెట్టేందుకు, ప్రైవేట్ వ్యక్తులకు లీజులకు అప్పగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంమీద వక్ఫ్‌బోర్డ్ భూముల విషయంలో అటు ప్రభుత్వ పెద్దలు ఇటు అధికార పార్టీ నేతలు తమను అడిగేవారే లేరన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఇష్టారాజ్యంలో కొన్ని అంశాలు..
⇒ చిత్తూరులోని ఇఫ్తేదార్ అలీ ఖాన్ షహీద్ దర్గా వక్ఫ్‌కు చెందిన 6.31 ఎకరాల భూమికి సంబంధించి వక్ఫ్ ట్రిబ్యునల్‌తో పాటు హైకోర్టులోనూ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఆ భూమిని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు ప్రతిపాదనలు పంపడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు సదరు దర్గా భూములను ఆక్రమణదారుల నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టిన వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ గౌస్ మొహిద్దిన్‌పై అక్రమ కేసు నమోదు చేయించడం వెనుక చిత్తూరు జిల్లా టీడీపీ కీలక నేత ప్రమేయం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాల్సిన చోట వక్ఫ్ ఆస్తులను కాపాడే అధికారులను ఇబ్బందులకు గురిచేయడం అధికార పార్టీ ఆగడాలకు పరాకాష్ట.
⇒ తాడిగడప ఖాజీ సర్వీస్ ఇనామ్ వక్ఫ్ భూములు 25.59 ఎకరాల విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన వేలం పాట ప్రక్రియను పూర్తి చేసి ఆ భూములను స్వా«దీనం చేసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా అధికార పార్టీ నేతల అండదండలతో ఆ భూములను ఆక్రమణదారులే సాగు చేస్తున్నారు. దానిపై ముస్లిం నేతలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ యంత్రాంగానికి చీమకుట్టినట్టు అయినా అనిపించలేదు. దీని వెనుక రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లే కారణమనే విమర్శలు రేగుతున్నాయి. అధికారులు స్పందించకపోవడం వల్లే ఆ భూముల్లో అక్రమ సాగు, పంట కోతలు జరిగాయని తాజాగా వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్–ఆడిటర్ నివేదిక తేల్చిచెప్పింది.
⇒ కర్నూలు జిల్లా కల్లూరు రోజా దర్గా వక్ఫ్ భూములు 19.65 ఎకరాలకు సంబంధించిన వ్యవహారంలో వక్ఫ్ భూముల మార్పిడి, బదిలీ చట్ట విరుద్ధమని గతేడాది ఆగçస్టు 4న లీగల్ ఒపీనియన్ స్పష్టంగా పేర్కొంది. అయినా ఇందుకు అనుగుణంగా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయనే విమర్శలున్నాయి.
⇒ విజయనగరం నగరంలోని గెజిటెడ్ ముస్లిం శ్మశాన వాటిక భూమిని అక్రమంగా సబ్ డివిజన్ చేసి.. ప్రైవేట్ ఆస్తిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వక్ఫ్ ఆస్తులకు పెనుముప్పు
రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే వాటిని పలు శాఖలకు, బడాబాబులకు అప్పగించే ప్రయత్నాలు చేయడం దారుణం. చంద్రబాబు వైఖరి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులకు పెనుముప్పు వాటిల్లింది. వక్ఫ్‌భూముల అన్యాక్రాంతానికి వక్ఫ్‌బోర్డు నుంచి అధికారుల వరకు వేగంగా చర్యలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా వ్యవహారాలపై అధికారికంగా ఆడిట్ జరపాలి. అక్రమాలపై స్వతంత్ర సంస్థతో విచారణ నిర్వహించి వాస్తవాలను ముస్లిం సమాజానికి వెల్లడించాలి. వక్ఫ్ ఆస్తులను కాపాడాల్సినవారే అవినీతికి పాల్పడితే, చట్టం తన పని చేయాల్సిందే. – షేక్ నాగుల్ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు


