వరద బాధితులకు మెరుగైన సేవలందించండి 

Alla Nani Comments that Provide better services to flood victims - Sakshi

వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశం  

సాక్షి, అమరావతి: వరద బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శనివారం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో వరద ముంపు జిల్లాల్లో అందుతున్న వైద్య సేవలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులను ఆయా జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారుల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి, ప్రతి క్యాంపులో సీనియర్‌ వైద్యుల బృందం అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలు సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య బృందాలు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ వరద బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అలాగే శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వరద తగ్గిన ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరించాలని, అవసరమైన మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆయా జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అన్ని జిల్లాల్లోని వైద్యారోగ్య శాఖ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు  ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే మెడికల్‌ క్యాంపుల వద్ద 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ  ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో వినయ్‌ చంద్‌ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top