అనకాపల్లి బెల్లంపొడికి పేటెంట్‌..

Acharya NG Ranga Agricultural University Anakapalle Granular Jaggery Get Patient - Sakshi

20 ఏళ్ల పాటు దక్కిన పేటెంట్‌ హక్కు 

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వీసీ వెల్లడి 

నాగజెముడు జ్యూస్‌కు ఎస్వీయూకి పేటెంట్‌ 

సాక్షి, అమరావతి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం అరుదైన ఘనత సాధించింది. బెల్లం, అనుబంధ ఉత్పత్తుల తయారీలో విశేష కృషికి పేటెంట్‌ దక్కింది. బెల్లాన్ని గుళికలు, పొడి రూపంలో తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని, తయారీ పద్ధతుల్ని అందుబాటులోకి తెచ్చినందుకు 20 ఏళ్ల పాటు పేటెంట్‌ హక్కు లభించినట్టు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. 1970 పేటెంట్‌ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా హక్కు కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పేటెంట్‌ కార్యాలయం ప్రకటించిందన్నారు. 

బెల్లం పాడవకుండా వినూత్న పరిజ్ఞానం 
చెరకు నుంచి సంప్రదాయ పద్ధతిలో రసాన్ని తీసి దాన్ని ఉడకబెట్టి బెల్లాన్ని తయారు చేస్తుంటారు. ఈ తరహా బెల్లంలో అంతర్గతంగా తేమ ఉండడం వల్ల సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది పాడవుతుంటుంది. ఈ నేపథ్యంలో అనకాపల్లిలోని అఖిల భారత సమన్వయ పరిశోధన సంస్థ (ఏఐసీఆర్‌పీ), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (రార్స్‌) గుళికలు లేదా పలుకుల రూపంలో (గ్రాన్యూల్స్‌) ఉండే బెల్లాన్ని తయారు చేసే వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది.  

రెండేళ్ల పాటు నిల్వ 
ఈ సాంకేతికతో తయారయ్యే పలుకుల రూపంలో ఉండే బెల్లంలో అతి తక్కువ తేమ ఉంటుంది. తయారు చేసినప్పటి నుంచి రెండేళ్ల పాటు నిల్వ ఉంటుంది. ప్యాకింగ్‌ సులువు. సూపర్‌ ఫాస్ఫేట్, ఫాస్పొరిక్‌ యాసిడ్‌ వంటి ప్రమాదకర రసాయనాలను వినియోగించాల్సిన పని లేదు. ఎగుమతికి అనువైంది. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసి అమ్మే బెల్లం కన్నా రైతులు ఎకరానికి అదనంగా రూ.40 వేలు సంపాదించవచ్చు.  

బెల్లంలో ఎన్నో ఔషధ గుణాలు 
వంద గ్రాముల బెల్లం పలుకుల్లో 80 నుంచి 90 గ్రాముల వరకు సుక్రోజ్, 0.4 గ్రాముల ప్రొటీన్, 0.1 గ్రాముల కొవ్వు, 0.6 నుంచి 1 గ్రాము వరకు ఖనిజాలు, 12 మిల్లీగ్రాముల ఐరన్, 4 మిల్లీగ్రాముల ఫాస్పరస్, 9 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. తీపిని తగ్గించే లక్షణాలూ ఉన్నాయి. అటువంటి గ్రాన్యూల్‌ జాగరీకి పేటెంట్‌ లభించడం యూనివర్సిటీకి గొప్ప గౌరవంగా వీసీ డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 8 దశల్లో ఈ బెల్లం తయారవుతుందని వివరించారు. 

నాగజెముడు జెల్లీకి పేటెంట్‌ 
నాగజెముడు కాయలతో తయారు చేసే రసం లేదా తాండ్రకు తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఫుడ్‌ సైన్స్, టెక్నాలజీ కళాశాలలకు సంయుక్తంగా పేటెంట్‌ లభించింది. ఇది 20 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. నాగజెముడు వర్షాధారిత మెట్ట ప్రాంతాల్లో లభిస్తుంది. ఇటీవలి కాలంలో నాగజెముడును వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. నాగజెముడులో పోషకాలతో పాటు ఔషధ లక్షణాలున్నాయి. సౌందర్య పోషణ వస్తువుల్లో వాడుతున్నారు. క్యాక్టస్‌ జాతికి చెందిన ఈ మొక్కల నుంచి వచ్చే కాయల నుంచి రసాన్ని తీసి జెల్లీ రూపంలోకి వచ్చేలా ఎండబెట్టి వాడుతున్నారు. చాక్లెట్ల మాదిరిగా తయారు చేసి వినియోగిస్తున్నారు. ఇందుకు ఈ పేటెంట్‌ లభించిందని డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top