సమ్మెలోకి వెళ్తామంటూ ‘ఆశ’ అల్టిమేటం
ఆస్పత్రులకు చంద్రబాబు సర్కారు రూ.3 వేల కోట్ల బకాయి
వీటి చెల్లింపుపై స్పష్టమైన హామీ కోరిన యజమానులు
కనీసం స్పందించని ప్రభుత్వం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో నిలిపేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ) గురువారం ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో సేవలు కొనసాగించడం తలకు మించిన భారంగా మారిందని నెట్‌వర్క్ ఆస్పత్రుల యజమానులు తేల్చిచెప్పారు. ఒకటో తేదీలోగా బకాయిలు చెల్లించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలు కొనసాగించబోమని అల్టీమేటం ఇచ్చారు.
చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు అనధికారికంగా బోర్డులు తిప్పేసిన దుస్థితి ఏర్పడింది. ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రుల మెట్లెక్కే పేదలను అటు నుంచి అటే వెనక్కు పంపేసే దయనీయ పరిస్థితులు ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో సేవలు నిలిపేస్తున్నట్లు ఆశ ప్రకటించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అని చెప్పి మొండిచెయ్యి
2024లో చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నెట్‌వర్క్ ఆస్పత్రులు పలు దఫాలుగా సమ్మెలోకి వెళ్లాయి. గతేడాది అయితే ఎప్పుడూ లేని విధంగా ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు రోడ్లెక్కి నిరసనలు, ఆందోళనలు చేశారు. విజయవాడ ధర్నాచౌక్‌లో ధర్నాకు సైతం దిగారు. అప్పట్లో వారితో చర్చలు జరిపి బకాయిలున్నింటినీ వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) చేస్తామని ప్రభుత్వం నమ్మించింది. దీంతో యజమానులు సమ్మె విరమించారు. ఆ తర్వాత వారికి ప్రభుత్వం మొండిచేయి చూపింది. బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నాం, బకాయిలు తీర్చేస్తామని కాలయాపన చేసింది.
బకాయిలపై స్పందించని ప్రభుత్వం..
మరోవైపు.. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిరీ్వర్యం చేసి, బీమా విధానం అమలుకు ప్రభుత్వం పూనుకుంది. బీమా కంపెనీ ఎంపికకు టెండరు కూడా పిలవడంతో తమ బకాయిల సంగతి తేల్చాలని, బీమాలో ప్రొసీజర్ల రేట్లు పెంచాలని హైకోర్టును సైతం యజమానులు ఆశ్రయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభించిన నాటి నుంచి ప్రభుత్వంపై యజమానులు బకాయిలు చెల్లించాలని కోర్టును ఆశ్రయించడం ఇదే తొలిసారి. కోర్టు ఆదేశాల మేరకు వైద్యశాఖ అధికారులు ఇటీవల ఆశ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బకాయిల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో పా టు, ప్రొసీజర్ రేట్లు పెంచాలని కోరారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు ఆస్పత్రుల యజమానులు వెల్లడించారు.


