YSR Pension Kanuka: విప్లవాత్మక నిర్ణయం.. వారి కళ్లలో ఆనందం

3 Years Of YS Jagan Government: YSR Pension Kanuka In AP - Sakshi

తన సుదీర్ఘ పాదయాత్రలో... అడుగడుగునా కనిపించిన అవ్వాతాతలతో మాట్లాడి - వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గమనించారు. వారికి ఎంత పింఛను వస్తుంది? ఎలా ఇస్తున్నారు? తదితర విషయాలపై అవగాహన పెంచుకున్నారు. వైఎస్సార్ పింఛన్‌ కానుక పథకాన్ని సమగ్రంగా రూపొందించి.. మేనిఫెస్టోలో ప్రకటించారు.

పాలన చేపట్టగానే పింఛన్‌ సొమ్మును పెంచుతామని, అర్హత వయస్సును తగ్గిస్తామని, అర్హత వున్నవారందరికీ పింఛన్లు ఇస్తామని వాగ్ధానం చేశారు. అంతేకాదు దీర్ఘకాలిక రోగులకు పింఛన్‌ ఇస్తామన్నారు. అలా సామాజిక పింఛన్ల విషయంలో పలు హామీలు ఇచ్చిన వైఎస్ జగన్ తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆ హామీలన్నిటిని నిలబెట్టుకున్నారు. అదే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందుతున్న లక్షలాది కుటుంబాలు చెబుతున్నాయి.

అవ్వాతాతల పింఛన్‌ అర్హత వయస్సు గతంలో 65 ఏళ్లు వుండేది.. దాన్ని అరవై ఏళ్లకు కుదించారు.. అంతే కాదు రాజకీయాలతో ప్రమేయం లేకుండా అర్హత వుంటే చాలు... ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని చెప్పిన వైఎస్ జగన్ - అదే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పింఛన్లు పెరిగాయి. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతు మంచానికే పరిమితమైన వారికి పదివేల రూపాయల పింఛన్‌ ఇస్తున్నారు. కుటుంబంలో ఒకరికే కాదు.. అర్హత వున్నవారందరికీ పింఛన్‌ ఇస్తున్నారు. ఇలా  పింఛన్ల పథకంలో అనేక మార్పులు తెచ్చి సామాన్య కుటుంబాలను ఆర్ధిక కష్టాలనుంచి గట్టెక్కిస్తున్నారు.
చదవండి: జగనన్న ప్రభుత్వం @3 ఏళ్లు: 3 సంవత్సరాలు.. 32 పథకాలు

రావి హేమలత.. ఈమె  కుటుంబం 18 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం నందపాలెం నుంచి విశాఖ నగరానికి వలస వచ్చింది.. హేమలత భర్త నారాయణరావు విశాఖలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో టిఫిన్‌ దుకాణం పెట్టుకొని దానిద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడు.. అదే సమయంలో ఈమె కూడా రెండు మూడు ఇళ్లలో పని చేస్తూ తనవంతుగా కుటుంబానికి అండగా నిలిచేది.. అలాంటి సమయంలో ఇద్దరు పిల్లలు చదువుకుంటూ కుటుంబం సాఫీగా సాగిపోతోందనుకుంటున్న సమయంలో... భర్త నారాయణరావు అకాల మరణం చెందారు. ఈ హఠాత్‌ పరిణామంతో  హేమలత ఆమె పిల్లలు భయాందోళనలకు గురయ్యారు.. కుటుంబ నావ ముందుకు సాగేది ఎలా ...పిల్లలు చదువులు , భవిష్యత్తు ఎలా వుంటుంది. ఇలా అనేక ప్రశ్నలతో హేమలతకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఇలాంటి సమయంలో వాలంటీర్‌ ఈమె ఇంటికి వచ్చారు. వితంత్రు పెన్షన్‌ కోసం దరఖాస్తు పెట్టించారు. అంతే కాదు ఈమె భర్త నారాయణరావు అకాల మరణానికి సంబంధించి వైఎస్సార్ బీమా కూడా ఈమెకు లభించేలా చూశారు.

విశాఖ జిల్లాలోనే ఇంకొక కుటుంబాన్ని సాక్షి పలకరించింది..ఈ పెద్దామె పేరు సూరాడ మహాలక్ష్మి...విశాఖ నగరం అక్కయ్యపాలెం 43వ వార్డులో నివసిస్తున్నారు. ఈమె వయస్సు సుమారు 70 సంవత్సరాలు.. వయసు మీద పడడంతో  ఏ పనీ చేయలేని పరిస్థితి.. పది అడుగులు వేయాలంటే ఆయాసం....నెల నెల మందులు వేసుకోవాల్సిందే.. మహాలక్ష్మికి ఒక కుమారుడు ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు.. వారు కూడా ఈమెతోనే  ఉంటున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన వాలంటీరే ఇంటికి వచ్చి పింఛన్‌ ఇస్తున్నారని మహాలక్ష్మి మనుమరాలు తబితా అంటోంది.

పింఛన్ల పథకానికి సంబంధించి ఆ మొత్తాన్ని రూ. 2, 250కి పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తన ప్రమాణ స్వీకారోత్సవం రోజున సంతకం చేశారు. అంతే కాదు ఈ మొత్తాన్ని దశలవారీగా పెంచుతూ మూడువేల రూపాయలకు తీసుకుపోతామని ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది జనవరినుంచి 2500 రూపాయలు చేశారు.

పింఛన్లు తీసుకోవడానికి గతంలో లాగా ఎక్కడా క్యూ లైన్లు లేవు.. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయమే లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి వారి తలుపు తట్టి మరీ వారి యోగక్షేమాలు తెలుసుకొని  పింఛన్లు అందిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా... అర్హత వుంటే చాలు పథకాలు అందించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం ప్రకారం అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు  తమ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పింఛన్‌ కానుక అందుకుంటున్నవారి సంఖ్య దేశంలోనే అధికంగా వుంది. సామాన్య కుటుంబాల జీవన ప్రమాణాల పెంపుదలకు దోహదం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగులు అవ్వాతాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి.

అవ్వాతాతలకు, వితంతువులకు ఇచ్చే పెన్షన్‌  మొత్తాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం పెంచింది. దేశవ్యాప్తంగా పెన్షన్లను ఇస్తున్న రాష్ట్రాల్లో అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌  గుర్తింపు పొందింది. చంద్రబాబు హయాంలో 36 లక్షల మందికి పెన్షన్లు వస్తే... వైఎస్ జగన్ ప్రభుత్వం 62 లక్షల మందికి అందిస్తోంది. సామాజిక పింఛన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రతి నెలా కేవలం 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు 1500 కోట్లు ఖర్చు చేస్తోంది.. అంతే కాదు ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటిదగ్గరకే వెళ్లి పింఛన్‌ ఇస్తుండడంతో అవ్వాతాతలు ఆనందంగా వున్నారు. పింఛన్లను డోర్‌ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా.... ఆంధ్రప్రదేశ్‌ గుర్తింపుపొందింది. ఇలా పింఛన్ల విషయంలో అనేక ప్రత్యేకతలు కలిగిన వైఎస్ జగన్ ప్రభుత్వం... అవ్వాతాలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకే కాదు...దీర్ఘకాల రోగాలతో మంచానికి పరిమితమైన వారికి కూడా పింఛన్లు అందిస్తోంది.

విశాఖ జిల్లా చోడవరం పట్టణం మారుతీ నగర్ లో కనకమహాలక్ష్మి కుటుంబం నివసిస్తోంది. ఈమె నాలుగు సంవత్సరాలుగా కిడ్నీల వ్యాధితో బాధపడుతోంది. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన ఈమె దీర్ఘకాల రోగులకు ఇచ్చే పింఛనుకు అర్హురాలు. అందుకే ఈమెకు నెల నెలా వైఎస్ జగన్ ప్రభుత్వం పదివేల రూపాయల పింఛను ఇస్తోంది.. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఈ మొత్తం 1500 రూపాయలుంటే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇది పదివేల రూపాయలైంది. దాంతో ఈమె అప్పుల పాలవ్వకుండా ప్రభుత్వం ఇస్తున్న ఆ పింఛన్‌తో క్రమం తప్పకుండా డయాలసిస్‌ చేయించుకుంటూ ప్రాణాలు కాపాడుకుంటోంది.

మహాలక్ష్మికి నలుగురు పిల్లలు.. వారిలో ముగ్గురు ఆడపిల్లలున్నారు. వారందరి పెళ్లిళ్లకు ఆస్తి అంతా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కిడ్నీ వ్యాధి సమస్యలు మొదలయ్యాయి..మందులు, చికిత్సలు, హాస్పిటల్‌ ఖర్చులు అదనంగా వచ్చిపడ్డాయి.. దాంతో ...పిల్లల పెళ్లిళ్లు అయిపోయాయి సంతోషంగా శేష జీవితాన్ని గడుపుదామనుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఒకపక్క అనారోగ్యం, మరో పక్క ఖర్చులు..ఇలాంటి పరిస్థితుల్లో ఈమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల నెలా పదివేల రూపాయల పింఛన్‌ ప్రతినెలా ఒకటోతేదీన ఠంచన్‌గా ఇస్తుండడంతో ఆ డబ్బుతో డయాలసిస్‌ చేయించుకోగలుగుతున్నానని ఆర్థికపరమైన ఒత్తిడి తొలగిపోయిందని ఈమె అంటున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరుదాకా విశాఖనుంచి అనంతపురం దాకా అందరూ ఇదే మాట చెబుతున్నారు.

మంచం నుంచి కదల్లేని వికలాంగుడి పేరు ఓబుళయ్య. భార్య పేరు ఉమారాణి. వీరు అనంతపురం పట్టణంలో నివసిస్తున్నారు. ఓబుళయ్యకు వికలాంగ పింఛన్ కింద 3000, ఉషారాణికి 2500 రూపాయల పింఛన్ వస్తోంది. వీరు ఈ డబ్బుతోనే మందులు, నిత్యావసర వస్తువుల కొనుక్కుంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో చెప్పులు అరిగేలా తిరిగినా  పింఛన్ ఇవ్వలేదని.. ఇప్పుడు వాలంటీర్లు ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకొని.... క్రమంగా తప్పకుండా పింఛన్ ఇస్తున్నారని వీరు చెబుతున్నారు.  

గత ప్రభుత్వ హయాంలో పింఛన్‌ కోసం ప్రభుత్వం చెప్పిన కార్యాలయందగ్గరకు వెళ్లి క్యూలో నిలబడాల్సి వచ్చేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పొద్దున్నే ఇంటిదగ్గరకు వచ్చి ఇస్తున్నారని పండ్ల వ్యాపారం చేస్తున్న హబీబుల్లా అంటున్నారు. పింఛన్‌ తోపాటు తనకు వ్యాపార నిర్వహణకోసం పదివేల రూపాయల రుణం కూడా ఇచ్చారని ఆయన చెబుతున్నారు.

సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఇంటిదగ్గరకే వచ్చి నేరుగా లబ్ధిదారులకు నగదు అందిస్తున్నారు. గతంలో పింఛన్ కావాలంటే ఎక్కడో ఉన్న కమ్యూనిటీ హాలో, పాఠశాలకో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ దుస్థితి లేదు.  నేరుగా ఇంటికే వచ్చి ఇవ్వటంతో అవ్వాతాతలు సంతోషిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top