వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌లో 12 రకాల సేవలు

12 types of services at YSR Village Clinics - Sakshi

సాక్షి, అమరావతి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు గ్రామంలోనే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రతి 2,500 జనాభాకు ఒక వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో చిన్న చిన్న జబ్బులకు కూడా 10 కిలోమీటర్ల దూరంలో ఉండే పీహెచ్‌సీకి వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,032 విలేజ్‌ క్లినిక్‌లు ఉన్నాయి. వీటిలో పని చేయడానికి బీఎస్సీ నర్సింగ్‌ అర్హత కలిగిన మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను నియమిస్తున్నారు. ఈ క్లినిక్‌లో 12 రకాల వైద్య సేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్‌ మెడికిల్‌ ఎక్విప్‌మెంట్‌ అందుబాటులో ఉంటుంది. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా విలేజ్‌ క్లినిక్‌లకు పక్కా భవనాల నిర్మాణం, ఉన్న భవనాల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1,692 కోట్లు ఖర్చు చేస్తోంది. విలేజ్‌ క్లినిక్‌ నుంచి టెలీ మెడిసిన్‌ సేవలు సైతం అందుబాటులో ఉంటాయి.  

సేవలు ఇవీ..
► గర్భిణులు, చిన్నారుల సంరక్షణకు అవసరమైన వైద్య సేవలు  
► నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ సేవలు 
► బాల్యం, కౌమార దశ ఆరోగ్య సంరక్షణ సేవలు 
► కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధక సేవలు, ఇతర పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సేవలు 
► అంటు వ్యాధుల నిర్వహణ.. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు 
► తీవ్రమైన సాధారణ అనారోగ్యాలు, చిన్న జబ్బులకు జనరల్‌ అవుట్‌ పేషెంట్‌ కేర్‌ 
► అసాంక్రమిక వ్యాధుల స్క్రీనింగ్, నివారణ, నియంత్రణ, నిర్వహణ 
► సాధారణ ఆఫ్తాల్మిక్‌ (కంటి సమస్యలు), ఈఎన్‌టీ సమస్యల కోసం జాగ్రత్తలు 
► ప్రాథమిక నోటి ఆరోగ్య సంరక్షణ 
► వృద్ధాప్య వ్యాధులకు చికిత్స, ఉపశమన ఆరోగ్య సంరక్షణ సేవలు 
► కాలిన గాయాలకు, ప్రమాదాల్లో గాయపడిన (ట్రామా) వారికి అత్యవసర వైద్య సేవలు 
► మానసిక ఆరోగ్య వ్యాధుల స్క్రీనింగ్, ప్రాథమిక నిర్వహణ, అనారోగ్య సమస్యలను జయించడం, మానసిక ప్రశాంతత కోసం రోగులకు యోగాపై అవగాహన కల్పిస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top