కుందుర్పి: ప్రకృతి వ్యవసాయం ద్వారానే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని రాయలసీమ అటవీశాఖ అధికారి యశోద బెన్ తెలిపారు. బుధవారం మండలంలోని అప్పిలేపల్లి, తమ్మయ్యదొడ్డి గ్రామాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన వివిధ రకాల పంటలను ఆయనతో పాటు జిల్లా అటవీశాఖ అధికారుల బృందం పరిశీలించింది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కుందుర్పి మండలంలో 10 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధించడం గర్వకారణమన్నారు. కుందుర్పి మండల రైతులను ఆదర్శంగా తీసుకొని జిల్లా వ్యాప్తంగా రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పంటలను సాగుచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారులు ప్రభాకర్, రేంజ్ అధికారి దీపిక తదితరులు పాల్గొన్నారు.


