బొమ్మనహాళ్: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్, అనంతపురం జిల్లా ప్రజల వరప్రదాయిని తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతోంది. బుధవారానికి డ్యాంలో నీటి నిల్వ 26.45 టీఎంసీలకు చేరింది. జలాశయం ఎగువన ఉన్న శివమొగ్గ, తీర్ధనహాళ్లి, చిక్కమగళూరు, వరనాడు, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు అడపాదడపా కురుస్తుండటంతో డ్యాంకు వరద చేరుతోందని టీబీ బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 1,633 అడుగులకు గాను 1,603.54 అడుగల మేర నీరు నిలిచింది. 105.788 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను 26.45 టీంఎసీల నీరు ఉంది. ఇన్‌ఫ్లో 10,938 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 3,184 క్యూసెక్కులుగా నమోదవుతోంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1,625.88 అడుగులతో 79.40 టీఎంసీల నీరు నిల్వ ఉండి 36,539 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 39,457 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉండింది.
రేపు విద్యాసంస్థల బంద్
అనంతపురం ఎడ్యుకేషన్: నీట్ పరీక్షల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్, ఏఐఎస్‌బీ అధ్యక్షుడు పృథ్వి, పీఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రతిభాభారతి, పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర, ఏఐఎస్‌ఏ జిల్లా కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడారు. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీని ఖండించారు. 24న నిర్వహించే విద్యాసంస్థల బంద్‌కు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు తరిమెల గిరి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు రజిత, ఎన్‌ఎస్‌యూఐ వినోద్ కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శివ, అరుణ్ రషీద్, గణేష్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘పోలీస్ కేసు పెట్టిస్తా.. జీవితాన్ని నాశనం చేస్తా’
తాడిపత్రిటౌన్: మట్టి అక్రమ తవ్వకాలు అడ్డుకున్న ఓ యువకుడిపై టీడీపీ నాయకుడు బెదిరింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. పెద్దపప్పూరు మండలం సోమనపల్లి సమీపంలో కొన్ని నెలలుగా కొట్టాలపల్లికి చెందిన టీడీపీ నాయకుడు రఘునాథనాయుడు మట్టి అక్రమ తవ్వకాలు సాగిస్తున్నాడు. పశు సంపదకు ఉపయోగపడుతున్న కొండను కరిగించేస్తున్నాడు. అక్రమ తవ్వకాలు ఆపాలని గ్రామస్తులు విన్నవించినా పెడచెవిన పెట్టాడు. దీంతో బుధవారం వీఆర్‌ఏ రాఘవేంద్ర, గ్రామస్తులు మట్టి టిప్పర్లను అడ్డుకుని రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. ఎవరూ స్పందించక పోవడంతో కలెక్టరేట్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆర్‌ఐ ఉదయ్, వీఆర్‌ఓ నాగేంద్ర అక్కడికి వెళ్లగా గ్రామస్తులు రెండు టిప్పర్లను వారికి అప్పగించారు. వాటిని రెవెన్యూ కార్యాలయానికి తరలిస్తుండగా, నంబర్ ప్లేట్ లేని ఒక టిప్పర్ మార్గమధ్యంలోనే కనబడకుండా పోయింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహంతో అక్రమ మట్టి తవ్వకాల వద్ద నిరసనకు దిగగా, ఇటాచీ వాహనాన్ని అక్రమార్కులు వదిలేసి పారిపోయారు. రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని ఇటాచీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మట్టి తవ్వకాలు అడ్డుకున్న తనపై ఎస్సీ,ఎస్టీ కేసు బనాయించి, జీవితాన్ని నాశనం చేస్తానంటూ టీడీపీ నాయకుడు బెదిరిస్తున్నట్లు వీఆర్‌ఏ రాఘవేంద్ర ‘సాక్షి’తో వాపోయాడు.


