రెండేళ్లు ఓపిక పట్టా.. ఇక ప్రజల్లోకే | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లు ఓపిక పట్టా.. ఇక ప్రజల్లోకే

Jul 23 2026 1:48 AM | Updated on Jul 23 2026 1:48 AM

పోలీసుల ఏకపక్ష వైఖరితోనే

గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

తాడిపత్రిటౌన్‌: ‘టీడీపీ నాయకుల ప్రోగ్రాం ఉందంటూ పోలీసులే నన్ను బయట తిరగకుండా చేశారు. రెండేళ్లు ఓపిక పట్టా. ఇక గ్రామాల్లో తిరుగుతాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం’ అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. బుధవారం యాడికిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ గ్రామాల్లో శాంతిభద్రతల విఘాతానికి కారణమవుతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై బైండోవర్‌ కేసులు నమోదు చేసి స్టేషన్‌లకు పిలిపించడం, తిట్టడం, కొట్టడం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తమ పార్టీ నాయకులు గ్రామాల్లో లేకుండా చేయడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఏ అధికారం ఉందని జేసీ ప్రభాకర్‌రెడ్డి 50 వాహనాల్లో విచ్చలవిడిగా గ్రామాల్లో తిరుగుతున్నాడని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు అక్రమాలు, అన్యాయాలు చేశారంటూ బురద చల్లడం అలవాటుగా మార్చుకున్నాడన్నారు. తిట్లు తిట్టడంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి కూడా తండ్రి కంటే రెండు ఆకులు ఎక్కువే చదివాడని విమర్శించారు. పెద్దపొలమడ ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై అస్మిత్‌రెడ్డి చేయి చేసుకోవడం చూస్తుంటే తండ్రికి ఏ మాత్రమూ తీసిపోడనిపిస్తోందన్నారు. తాడిపత్రి పట్టణంలో పోలీసుల వైఖరి మరీ అధ్వానంగా మారిందని, గంజాయి, మట్కా, పేకాట ఆదాయాల కోసం జేసీ చెప్పిందే వేదంలా ముందుకెళ్తున్నారని విమర్శించారు. దీనికి బదులు పోలీసులే మట్కా, పేకాట కేంద్రాలు నిర్వహించి గంజాయి అమ్మకాలు చేస్తే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అంటూ ఎద్దేవా చేశారు. ఇకపై బైండోవర్‌ పేరుతో వైఎస్సార్‌సీపీ నాయకులను అణచివేయాలని ప్రయత్నిస్తే పోలీస్‌స్టేషన్ల ముందు పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement