చెదిరిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కల | - | Sakshi
Sakshi News home page

చెదిరిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కల

Jul 23 2026 1:48 AM | Updated on Jul 23 2026 1:48 AM

అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లిన

జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు

వేరే యూనివర్సిటీల్లో అర్హులుగా

గుర్తించినా ఇక్కడ మాత్రం తిరస్కరణ

అనంతపురం: యూనివర్సిటీలో రెగ్యులర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా స్థిరపడాలనే వారి కల చెదిరిపోయింది. ఆవేదన చెందడం మినహా చేసేదేమీ లేక మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో 79 ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించగా, మొత్తం 12,892 దరఖాస్తులు అందాయి. ఇందులో 11,676 దరఖాస్తులకు ఆమోదం తెలిపిన అధికారులు మిగిలిని వాటిని తిరస్కరించారు. వీటిల్లో సింహభాగం ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులవే ఉండడం గమనార్హం. ఈ క్రమంలో జేఎన్‌టీయూ(ఏ) అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పే స్లిప్పులు లేవంటూ..

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ బోధనానుభవాన్ని ధ్రువీకరించే పత్రాలతో పాటు వేతనాలకు సంబంధించిన పే స్లిప్పులను సమర్పించాలనే నిబంధన విధించారు. అయితే, కన్సాలిడేటేడ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న పలువురు అధ్యాపకులకు వర్సిటీల నుంచి సాధారణ ఉద్యోగుల తరహాలో పే స్లిప్పులు జారీ చేయలేదు. తాజాగా పే స్లిప్‌ లేదనే సాకుతో దరఖాస్తులు తిరస్కరించడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీలే తమను నియామకం చేసి, ఇప్పుడు ఇలా వ్యవహరించడం సరికాదంటూ బాధితులు వాపోతున్నారు.

వారిపై అమితప్రేమ..

గతంలో వివాదాస్పదంగా చేపట్టిన పోస్టులను తాజాగా రెగ్యులరైజ్‌ చేసేందుకు కసరత్తు చేస్తుండడంపైనా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో 2017లో 9 ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేసిన అధికారులు.. 2019 జనవరి మొదటి వారంలో హడావుడిగా నియామక పత్రాలు అందజేశారు. పాలిమర్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి మెకానికల్‌ విభాగంలో ప్రొఫెసర్‌ పోస్టు ఇవ్వడం, నోటిఫికేషన్‌ సమయానికి పీహెచ్‌డీ పూర్తి కాని వారికి సైతం పోస్టు కట్టబెట్టడం తదితర వింత ఘటనలు చోటుచేసుకోవడంతో అప్పట్లో పోస్టుల భర్తీ వివాదాస్పదమైంది. ఈ క్రమంలో 2019 జూన్‌లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం వీరిని ఉద్యోగంలో నుంచి తొలగించగా.. హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని తిరిగి విధుల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. తాజాగా ఈ 9 ప్రొఫెసర్‌ పోస్టులను రెగ్యులరైజ్‌ చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వింత వైఖరి అవలంబిస్తూ అర్హుల దరఖాస్తులను తిరస్కరిస్తున్న వర్సిటీ అధికారులు.. మరోవైపు అనర్హులైన ఉద్యోగులపై అమిత ప్రేమ కనబరుస్తూ పోస్టులను క్రమబద్ధీకరించేందుకు ఆసక్తి కనబరుస్తుండడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

జేఎన్‌టీయూ (ఏ)లోని ఈసీఈ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు అజయ్‌ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. ఈయన ప్రైవేట్‌ అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 10 సంవత్సరాల అధ్యాపక అనుభవం ఉంది. అనుభవ ధ్రువీకరణ పత్రంతో పాటు పేస్లిప్పులు కూడా అందించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు అన్ని అర్హతలు ఉన్న అతని దరఖాస్తును జేఎన్‌టీయూ అధికారులు తిరస్కరించారు. కాకినాడ జేఎన్‌టీయూలో అజయ్‌ దరఖాస్తు చేసుకోగా, అక్కడ ఆమోదించడం గమనార్హం. అజయ్‌ ఒక్కరిదే కాదు.. జేఎన్‌టీయూ

అనంతపురం పరిధిలో ఏకంగా ఇలాంటి

351 దరఖాస్తులు తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement