● పాతాళానికి పడిపోయిన టమాట ధరలు
● కుదేలవుతున్న రైతన్నలు
కళ్యాణదుర్గం/ అనంతపురం అగ్రికల్చర్: మార్కెట్‌లో టమాట ధరలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. కనీసం కాయలు కోసే కూలీల ఖర్చులు, మార్కెట్‌కు తరలించే రవాణా చార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి, లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో దిగాలు చెందుతు న్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఈసారి రైతులు టమాట పంట సాగు చేశారు. జిల్లావ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో పంట సాగులోకి వచ్చినట్లు గణాంకాలు వెల్లడిన్నాయి. భూమి దున్నడం, విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులతో పాటు కూలీ ఖర్చుల కోసం ఎకరానికి రూ. లక్షకు పైగా పెట్టుబడులు పెట్టారు. పంట చేతికి వచ్చి మంచి లాభాలు వస్తాయని ఆశించిన రైతులకు మార్కెట్‌లో ధరలు కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 15 కిలోల బాక్సు మొదటి రకం రూ.150 నుంచి రూ.200, రెండో రకం రూ.120–రూ.140, మూడో రకం రూ.30–రూ.100 లోపే పలుకుతుండడంతో ఆవేదనలో కూరుకుపోయారు. చిన్న సైజు కాయలు, తేమ ఉన్నవి, మచ్చ వచ్చిన కాయలు కొనడానికి వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. అలాంటివి బాక్సు రూ.50 కూడా పలకడం లేదు. గరిష్ట ధర కూడా నాణ్యమైన కొన్ని లాట్లకే లభిస్తోంది. మిగతావన్నీ రూ.100–రూ.150 పలుకుతుండంతో పెట్టుబడులు కూడా రావడం లేదంటూ నిట్టూరుస్తున్నారు. చాలా మంది పంటను కోయకుండానే పొలాల్లో వదిలేస్తుండడం గమనార్హం.
ప్రభుత్వం ఆదుకోవాలి..
ఏటా టమాట రైతులకు నష్టాలు తప్పడం లేదు. జిల్లాలో పండించే టమాటలను బెంగుళూరు, చైన్నె, హైదరాబాద్, మహారాష్ట్ర, కోలార్ వంటి ప్రధాన నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఆయా చోట్ల మార్కెట్ తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధర ప్రకటించాలని, మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలని వేడుకుంటున్నారు.


