అనంతపురం: టీడీపీ మూకల పాశవిక దాడులను వ్యతిరేకిస్తూ తాడిపత్రిలోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన శాంతియుత దీక్షపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో పార్టీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అరాచకాలు పేట్రేగిపోయాయని, తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమవగా పోలీసు భారీగా మోహరించి అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, నాయకులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం నేతలను ఇంటికి తరలించేందుకు ప్రయత్నించగా.. అనంత, విశ్వేశ్వరెడ్డి కోర్టు రోడ్డు వద్ద రెండు గంటలపాటు బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో వారిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.
తాడిపత్రిలో పరాకాష్టకు నిరంకుశ పాలన
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తాడిపత్రిలో నిరంకుశ పాలన పరాకాష్టకు చేరిందని అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టే సంస్కృతి తీసుకొచ్చారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తామంటే అనుమతులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు అధికార టీడీపీ కార్యకర్తలుగా పని చేసే దుస్థితికి వచ్చారని మండిపడ్డారు. 43 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంత దిగజారిన పోలీసులను చూడలేదన్నారు. రాష్ట్రంలోని 174 నియోజకవర్గాల్లో ఒక పరిస్థితి ఉంటే.. తాడిపత్రిలో మాత్రం మరో పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో మట్కా, గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. వాటిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారని విమర్శించారు. దీన్ని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తే టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు పోలీసులను అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి గ్రామాల్లోకి దండయాత్రగా వెళ్లినా మిన్నకుండిపోయే పోలీసులు తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తామంటే మాత్రం అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేం ప్రశ్నిస్తే తమ ఇళ్ల వద్దకు వస్తామని బెదిరిస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి మాటలు ఎస్పీకి వినపడడం లేదా అని ప్రశ్నించారు. తమ పోరాటం ఇంతటితో ఆగదని, జిల్లా అంతా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
అప్రజాస్వామిక విధానాలపై పోరాడతాం
పోలీసులు కట్టడి చేయాల్సింది తమనా.. లేక తాడిపత్రిలో దాడులు చేస్తున్న వారినా అని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు వై.విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ‘పెద్దారెడ్డి ఇంటి చుట్టూ ముళ్ల కంచె వేశారు. బయటకు రాకూడదని అంటున్నారు. తాడిపత్రిలో ప్రత్యేక రాజ్యాంగం ఉందా.. ప్రత్యేక ప్రతిపత్తి ఏమైనా కల్పించారా’ అంటూ నిలదీశారు. ఇతర పార్టీలను లేకుండా చేస్తామంటే కుదరదని, జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికై నా విజ్ఞతతో నడుచుకోవాలని సూచించారు. అప్రజాస్వామిక విధానాలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
గృహనిర్బంధాలు, అరెస్టులతో ఉద్రిక్తత
తాడిపత్రిలో నిరంకుశ పాలనపై భగ్గుమన్న అనంత


