గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని కాచిగూడ–అశోకపురం మధ్య ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. కాచిగూడ జంక్షన్ నుంచి ఆగస్టు 25న, అశోకపురం నుంచి 26 నుంచి ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. కాచిగూడ నుంచి రోజూ ఈ రైలు (12785) సాయంత్రం 7.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10 గంటలకు అశోకపురం జంక్షన్‌కు చేరుతుందన్నారు. తిరిగి ఈ రైలు (12786) అశోకపురం జంక్షన్‌లో మధ్యాహ్నం 2.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు కాచిగూడ జంక్షన్‌కు చేరుతుందన్నారు. ఈ రైలు జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, అనంతపురం. ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, గౌరిబిదనూరు, దొడ్డబళ్లాపురం, యలహంక, బెంగళూరు ఈస్ట్, కేఎస్‌ఆర్ బెంగళూరు, కనిగేరి, రామనగరం, మండ్య, మైసూర్ మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు.
ఇవన్నీ ఎందుకు ‘సర్’?
● వివరాల సేకరణపై ప్రజల ఆగ్రహం
అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్–సర్) ప్రక్రియపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. బీఎల్‌ఓలు సేకరిస్తున్న వివరాలపై ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. ఓటుకు సంబంధించి 2002లోని డేటా ప్రజల వద్ద ఎలా ఉంటుందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ‘సర్’ నిర్వహిస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం ఇస్తున్నారు. 24 ఏళ్ల కిందటి కుటుంబ డేటా... అప్పట్లో ఎక్కడ నివసించారు... ఎక్కడ ఓటు వేశారు.. ఓటరు జాబితాలో భాగం సంఖ్య, ఓటరు వరుస సంఖ్య, బూత్ నంబరు తదితర వివరాలు అడుగుతున్నారు. ఇక్కడే అసలు సమస్య తలెత్తుతోంది. పాత ఆధారాలు లేవనే సాకుతో ఓటు తొలగిస్తారనే ఆందోళనకు గురవుతున్నారు. బయోమెట్రిక్ ఆధారంగా పనిచేసే ఆధార్‌ను ఓటరు కార్డుతో లింక్ చేస్తే ఫేక్ ఓట్లు తేలిపోతాయి కదా.. అది వదిలేసి తమనెందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఐడీసీఏ టీ20
చాంపియన్‌గా కర్ణాటక
అనంతపురం: ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ (ఐడీసీఏ) ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న ఐడీసీఐ–19 టీ–20 చాంపియన్ షిప్ టోర్నీ విజేతగా కర్ణాటక జట్టు నిలిచింది. శుక్రవారం జరిగిన రెండు సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లూ ఉత్కంఠ భరితంగా సాగాయి. హర్యానా, ఒడిశా జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఒడిశా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు సాధించింది. 128 పరుగుల విజయ లక్ష్యంగా బరిలో దిగిన హర్యానా జట్టు కూడా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు సాధించింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌లో తలపడాల్సి వచ్చింది. ఈ దశలో హర్యానా జట్టు వికెట్ నష్టపోకుండా 9 పరుగులు సాధించగా, ఒడిశా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 6 పరుగులకే పరిమితమైంది. దీంతో హర్యానా జట్టును విజేతగా ప్రకటించారు. రెండో సెమీఫైనల్‌లో ఢిల్లీ జట్టుపై కర్ణాటక జట్టు గెలిచింది. అనంతరం ఫైనల్ మ్యాచ్‌లో హర్యాన జట్టుపై కర్ణాటక గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.


