గుంతకల్లు: దాడులకు పాల్పడిన టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా నిరసన చేపడుతున్న తమను అడ్డుకోవడం ముమ్మాటికీ ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో నారా లోకేష్ ‘రెడ్‌బుక్’ రాజ్యాంగాన్ని పోలీసులు తూచా తప్పకుండా అమలుచేస్తూ అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా సహాయ కార్యదర్శి గంగులకుంట కేశవరెడ్డిపై దాడికి నిరసనగా తాడిపత్రిలో చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావం తెలపడానికి గుంతకల్లు నుంచి నైరుతిరెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు బయలుదేరడానికి సిద్దమయ్యారు. దీంతో డీఎస్పీ శ్రీనివాస్, వన్‌టౌన్ సీఐ మనోహర్ నేతృత్వంలో పోలీసులు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఇంటివద్ద మోహరించారు. ఈ సమయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నైరుతిరెడ్డిని ముందుకు కదలకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం నైరుతిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పోలీసుల సమక్షంలోనే దాడులకు పాల్పడుతున్న అధికార పార్టీ గూండాలపై ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం దారుణమన్నారు.


