ప్రజల భాగస్వామ్యంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలూ తీసుకున్నాం. ఇందుకోసం ఎంపిక చేసిన సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. గ్రామీణ స్థాయిలో అవగాహన ర్యాలీలు చేపట్టి ప్రజలను చైతన్య పరిచాం. జిల్లా వ్యాప్తంగా 3.36 లక్షల డోస్‌లు సిద్ధంగా ఉంచాం.
– డాక్టర్ ఈబీ దేవి, డీఎంహెచ్‌ఓ
రేపటి నుంచి పల్స్ పోలియో
అనంతపురం సిటీ: పోలియో మహమ్మారి నుంచి చిన్నారులను కాపాడేందుకు వైద్య ఆరోగ్య శాఖ పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు వేసేందుకు ఆదివారం నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ ఏడాది రెండో విడతలో భాగంగా 2,83,430 మంది పిల్లలకు చుక్కల మందు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎంపిక చేసిన సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 28న పోలియో కేంద్రాల్లో చుక్కల మందు వేసిన తర్వాత మిగిలిన పిల్లలకు 29, 30 తేదీల్లో వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయనున్నారు.
5,247 మంది సిబ్బంది: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 5,247 మంది సిబ్బందిని వైద్య, ఆరోగ్య శాఖ నియమించింది. వీరిలో 1,638 మంది ఆశా కార్యకర్తలు, 2,041 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 663 మంది ఏఎన్‌ఎంలు, 433 మంది ఎంఎల్‌హెచ్‌పీలు, 120 మంది మెడికల్ ఆఫీసర్లు, 284 మంది రూట్ సూపర్ వైజర్లు, 68 మొబైల్ బృందాలు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొననున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1,289 బూత్‌లు, పట్టణ ప్రాంతాల్లో 334 బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సంతలు, జాతరలు, జనసందోహ ప్రాంతాల్లోనూ ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.


