శింగనమల: ఇసుకను అక్రమంగా తరలించే క్రమంలో ‘తెలుగు’ తమ్ముళ్లు తన్నుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మండలంలోని ఉల్లికల్లు సమీపంలోని పెన్నానది నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం ఒక్కొక్కరు రూ.లక్ష వరకు జేబుల్లోకి వేసుకుంటున్నారు. ఈ క్రమంలో పెరవలికి చెందిన ఓ టీడీపీ మండల నాయకుడు కూడా శుక్రవారం ఉల్లికల్లు పెన్నానది వద్దకు అనుచరులతో కలిసి వెళ్లాడు. ఇకపై తాను కూడా ఇసుక తరలిస్తానని చెప్పాడు. అయితే, ఈ విషయంపై ముగ్గురి నడుమ గొడవ జరిగింది. స్థానికులు కలగజేసుకోవడంతో అంతా సద్దుమణిగింది. అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతోనే ఇంత దాకా వచ్చిందని, ఇప్పటికై నా ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


