చర్యలు తీసుకుంటాం
అనంతపురం టౌన్: డిప్యుటేషన్ల మాటున పదుల సంఖ్యలో విద్యుత్ శాఖ ఉద్యోగులు (లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్లు, జేఎల్‌ఎంలు) పాతుకుపోయారు. కొందరు పలుకుబడి, మరికొందరు అనారోగ్య కారణాలు, ఇంకొందరు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని నగరంలో మకాం వేశారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. నెల రోజుల క్రితం జిల్లాను గాలివాన కుదిపేసిన సమయంలో కళ్యాణదుర్గం విద్యుత్ డివిజన్ పరిధిలో కణేకల్లు మండలంలోని కొన్ని గ్రామాలకు రెండు రోజుల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనిపై ఆయా గ్రామాల ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టిన అధికారులు సిబ్బంది కొరతతో విద్యుత్ పునరుద్ధరణకు ఆలస్యమవున్నట్లు గుర్తించడం గమనార్హం. ఇలాంటి ఉదంతాలు జిల్లాలో చాలానే ఉన్నాయి.
రద్దు చేసినా..
20 రోజుల క్రితం ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ జిల్లా వ్యాప్తంగా అన్ని కేడర్లలో డిప్యుటేషన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 10 రోజుల్లో మాతృ స్థానాలకు వెళ్లిపోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. కొందరు ఉద్యోగులు యథాస్థానాలకు వెళ్లిపోగా.. మరి కొంత మంది ఉన్న స్థానాల నుంచి కదలలేదు. ఎస్‌ఈ ఉత్తర్వులు సైతం లెక్కచేయడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కళ్యాణదుర్గం డివిజన్‌లో పని చేస్తున్న ఓ లైన్ ఇన్‌స్పెక్టర్ (ఎల్‌ఐ) డిప్యుటేషన్‌పై నగరానికి వచ్చి 10 ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం బళ్లారి రోడ్డులోని సబ్ స్టేషన్‌లో పాతుకుపోయాడు. విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ
ఇక్కడే కాలం వెళ్లదీస్తున్నట్లు సమాచారం.
విద్యుత్ శాఖ డీ3 సెక్షన్ పరిధిలో ఓ ఉద్యోగి ఫోర్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుక్కరాయసముద్రం నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఆయన 5 ఏళ్లుగా ఇక్కడే పాగా వేశారు. ఈ కాలంలో ముగ్గురు ఎస్‌ఈలు మారినా ఇతన్ని మాత్రం ఇక్కడి నుంచి పంపే సాహసం చేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల మొదటి రోడ్డులో జేఎల్‌ఎం విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఘటనలో సైతం ఇతను చక్రం తిప్పి సస్పెండ్ కాకుండా తప్పించుకున్నాడనే విమర్శలున్నాయి. ఈ సెక్షన్ పరిధిలో రెగ్యులర్ ఏఈ ఉన్నా ఫోర్‌మెన్ చెప్పిందే శాసనంగా మారినట్లు తెలిసింది.
విద్యుత్ శాఖలో డిప్యుటేషన్ల లీలలు
జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో వివిధ సెక్షన్లలో తిష్ట
ఎస్‌ఈ ఉత్తర్వులు జారీ చేసినా డిప్యుటేషన్లు రద్దు చేసుకోని వైనం


