ప్రమాదాలకు కేరాఫ్‌ ఎన్‌హెచ్‌ 67 | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాలకు కేరాఫ్‌ ఎన్‌హెచ్‌ 67

Jun 27 2026 2:13 AM | Updated on Jun 27 2026 2:13 AM

తాడిపత్రి రూరల్‌: తాడిపత్రి–గుత్తి మార్గంలో ఎన్‌హెచ్‌ –67 ప్రమాదాలకు కేరాఫ్‌గా మారింది. ఈ మార్గంలో 15 రోజుల్లోనే ముగ్గురు మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 7న పులిప్రొద్దుటూరు సమీపంలో కంటైనర్‌ ఢీకొనడంతో గంగాదేవిపల్లికి చెందిన రామాంజులరెడ్డి (40) మృత్యువాత పడ్డాడు. 17న యుగుడూరుకు చెందిన సతీష్‌ (25) తాడిపత్రి నుంచి స్నేహితుడు నాగేంద్రతో కలిసి బైకులో స్వగ్రామానికి వెళ్తూ పులిప్రొద్దుటూరు సమీపంలో రోడ్డుపై నిలిపిన లారీని ఢీకొని మృతి చెందగా, నాగేంద్ర గాయాలతో బయటపడ్డాడు. 21వ తేదీన తాడిపత్రిలోని విజయ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న విశ్వనాథ్‌ (45) గుత్తి నుంచి వస్తూ చుక్కలూరు క్రాస్‌ సమీపంలో ఎదురుగా టిప్పర్‌ ఢీకొనడంతో కన్నుమూశాడు.

జంకుతున్న జనం..

ఎన్‌హెచ్‌–67కు ఇరువైపులా గ్రామాలు ఉండటంతో ప్రజలు, రైతులు నిత్యం ఏదో పని నిమిత్తం తాడిపత్రికి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో హైవేపై అతివేగంగా వెళుతున్న వాహనాలతో భయకంపితులవుతున్నారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో బెంబేలెత్తుతున్నారు. ద్విచక్ర వాహనదారులు హైవేపైకి ఎక్కాలన్నా జంకుతున్నారు.

మృత్యు మలుపులు..

తాడిపత్రి– గుత్తి మధ్య 55 కిలోమీటర్ల దూరంలోనే 30 మలుపులు ఉండడం వాహనదారులకు శాపంగా మారింది. తాడిపత్రి నుంచి చీములవాగుపల్లి గ్రామ క్రాస్‌ వరకు ఎక్కువగా రోడ్డు మలుపులు ఉన్నాయి. చుక్కలూరు గ్రామం వద్ద మలుపు టెర్రర్‌గా మారింది. చుక్కలూరు రోడ్డు క్రాస్‌ వద్ద మూడు రోడ్ల కూడలి వద్ద ఉన్న మలుపు కూడా ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. మరోవైపు హైవే పక్కన స్లాబ్‌, గ్రానైట్‌ వ్యర్థాలను వేస్తుండడం ప్రమాద తీవ్రతను పెంచుతోంది. ఆయా మలుపుల వద్ద హైవే అధికారులు ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాత్రి సమయంలో లారీలు, ట్రాక్టర్లు తదితర వాహనాలు మరమ్మతుల పేరుతో రోడ్డుపై నిలిపినప్పుడు రేడియం స్టిక్కర్లను వాటికి అతికించి ఉన్నా, లైట్లు వేసినా ద్విచక్రవాహనదారులు గమనించి జాగ్రత్త పడతారు. కానీ, ఆయా వాహనదారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజల ప్రాణాలమీదికొస్తోంది.

చర్యలు తీసుకుంటాం

ఎన్‌హెచ్‌–67లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న భారీ వాహనాలు, లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై చర్యలు తీసుకుంటాం. హైవే అధికారులతో మాట్లాడి ప్రమాద సూచికలను ఏర్పాటు చేయిస్తాం. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు అరికట్టవచ్చు.

– దయాకర్‌రెడ్డి, అప్‌గ్రేడ్‌ పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ

15 రోజుల్లోనే ముగ్గురు బలి

ప్రాణాలు మింగేస్తున్న మలుపులు

ప్రమాదాలను అరికట్టడంలో అధికారుల విఫలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement