అదరహో భరత్‌ | - | Sakshi
Sakshi News home page

అదరహో భరత్‌

Jun 27 2026 2:13 AM | Updated on Jun 27 2026 2:13 AM

అనంతపురం కల్చరల్‌: ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుని జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత బిసాతి భరత్‌ మరోసారి అంతర్జాతీయ వేదికపై జిల్లా ఖ్యాతిని ఘనంగా చాటారు. అజర్‌బైజాన్‌ దేశ రాజధాని బాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 9వ సీఐసీఏ (కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇంటరాక్షన్‌ కాన్ఫిడెన్సు బిల్డింగ్‌ మెజర్స్‌ ఇన్‌ ఆసియా) కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. దేశం తరఫున ముగ్గురు ఎంపిక కాగా అందులో భరత్‌ ఒకరు కావడం గమనార్హం. యువత సాధికారత, నాయకత్వ వికాసం, జాతి నిర్మాణంలో విశేష కృషి చేస్తున్నందుకు భరత్‌ను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. భరత్‌ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆ దిశగా తన వంతుగా దేశ ఔన్నత్యాన్ని చాటడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. నూతన ఆవిష్కరణలు, పట్టణ రవాణా, పర్యావరణ పరిరక్షణ, ప్రజాభద్రత, స్మార్ట్‌ సిటీ అభివృద్ధి తదితర అంశాలపై సీఐసీఏలో చర్చిస్తారన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖామాత్యులు మన్సుఖ్‌ మాండవీయ సహకారమందిస్తున్నారని వెల్లడించారు. భరత్‌కు ‘మై భారత్‌ ప్రోగ్రాం’ అధికారి గోవర్దన శ్రీనివాసులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత జయమారుతి, సుంకర రమేష్‌ అభినందనలు తెలిపారు.

17 మంది బీఎల్‌ఓలకు షోకాజ్‌ నోటీసులు

అనంతపురం క్రైం: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా ఓటర్ల నమోదు ఫారాల డిజిటైజేషన్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది బూత్‌ లెవల్‌ అధికారుల(బీఎల్‌ఓల)కు మున్సిపల్‌ కమిషనర్‌ శుక్రవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నోటీసులు అందుకున్న వారిలో బి. మల్లన్న, ఎం. నాగాంజలి, కె. ఫణి కృష్ణ, ఎస్‌. రేష్మా, ఎ. హేమసుందరి, జి. విద్య, అరికట్ల ఉదయశ్రీ , బుల్లి అనిల్‌ కుమార్‌, బి. గణేష్‌ రెడ్డి, యల్లమ్మ రాగే, జి.టి. శ్రావణి, సోంపల్లి చార్విత్‌, ఎన్‌. నవీన్‌ కుమార్‌, జి. హరిత, సి.కె. నరేష్‌, ఎం. చైతన్య, గురు కుమారి ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement