2002 ఓటరు జాబితా అందుబాటులో ఉంచాలి | - | Sakshi
Sakshi News home page

2002 ఓటరు జాబితా అందుబాటులో ఉంచాలి

Jun 27 2026 2:13 AM | Updated on Jun 27 2026 2:13 AM

ఎన్యుమరేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి

అధికారులకు కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశం

అనంతపురం అర్బన్‌: సచివాలయాల్లో 2002 ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. అనంతపురం అర్బన్‌, రాప్తాడు, శింగనమల, ఉరవకొండ నియోజకవర్గాల్లో వేగం పెంచాలన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారదర్శక ఓటరు జాబితా కోసం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌– సర్‌)పై కలెక్టర్‌ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ వివరాల ధ్రువీకరణ కోసం ఇబ్బంది పడకుండా సచివాలయాల్లో 2002 ఓటరు జాబితా ఒకట్రెండు సిద్ధం చేసి హెల్ప్‌డెస్క్‌ ద్వారా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బీఎల్‌ఓలు ప్రతి ఇంటిని సందర్శించి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టేలా ఈఆర్‌ఓలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. బీఎల్‌ఓల వద్ద అందుబాటులో ఉండే ఆన్‌మ్యా ప్డ్‌, అనామలీస్‌, ఆన్‌లైన్‌ మ్యాపింగ్‌ వివరాలను క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా సరిచూసుకోవాలన్నారు. బీఎల్‌ఏలతో కలిసి రోజూ సాయంత్రం కనీసం గంట సమయంపాటు ఏదేని అనుకూల ప్రదేశంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎన్యుమరేషన్‌ ఫాం (గణన ఫాం)లు పూరించడంలోనూ, ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ బీఎల్‌ఓలకు సచివాలయంలోని ఇతర సిబ్బంది సహాయపడాలని చెప్పారు. బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించేప్పుడు స్థానిక సచివాలయ సిబ్బంది పూర్తి సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓను ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ మలోల, అన్ని నియోజకవర్గాల ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement