ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Jun 20 2026 5:46 AM | Updated on Jun 20 2026 5:46 AM

గుత్తి: పట్టణంలోని కోట నేసే వీధిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థిని అఫ్రీన్‌ (19) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాలమేరకు.. అఫ్రీన్‌ తల్లి ఖైరూన్‌బీతో కలిసి కోట నేసే వీధిలో నివస్తోంది. ఆమె తండ్రి హైదరాబాద్‌లో పనికోసమని ఆర్నెళ్ల క్రితం వెళ్లాడు. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా.. మొదటి కుమార్తెకు వివాహమైంది. అఫ్రీన్‌ గుంతకల్లులోని ఓ డిగ్రీ కాలేజీలో ద్వితీయ సంవత్సరం డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. అయితే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఫ్రీన్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె విగత జీవిగా పడి ఉండటం చూసి తల్లి ఖైరూన్‌బీ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ అమీర్‌ఖాన్‌ పరిశీలించారు. అయితే ఉరి వేసుకున్న ప్రాంతంలో అఫ్రీన్‌ కాళ్లు ఫ్లోర్‌కు ఉన్న బండలకు ఆనుకుని ఉన్నాయి. దీంతో ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పోలీసుల చేతిలో సూసైడ్‌ నోట్‌

పోలీసులకు అఫ్రీన్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ దొరికింది. తండ్రి సరిగా చూసుకోవడం లేదని, ఒంటరిగా ఉండాల్సి వస్తోందని, తల్లికి ఎలాంటి హెల్ప్‌ చేయలేకపోతున్నానని నోట్‌ రాసింది. ఇక జీవించడం తనకు ఇష్టం లేదని, చనిపోతున్నానని రాసినట్లు పోలీసులు తెలిపారు. అయితే సూసైడ్‌ నోట్‌ను పోలీసులు బయటకు పెట్టలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement