అది 1999 సంవత్సరం. నార్పల మండలానికి చెందిన ఓ నిండు గర్భిణి ప్రసవం కాక ఇబ్బంది పడుతుంటే కుటుంబసభ్యులు ఆగమేఘాలపై అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకువచ్చారు. పేదరికం కారణంగా సరైన పౌష్టికాహారం లేక రక్తహీనతతో బాధపడుతున్న ఆమెకు వెంటనే రక్తం ఇవ్వాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న మానవత రక్తదాతల సంఘం కో–కన్వీనర్ సలీం మాలిక్ వెంటనే స్పందించారు. రాత్రికి రాత్రి ఆమెకు రక్తాన్ని దానంగా ఇచ్చారు. అయినా ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో గంట వ్యవధిలో మరోసారి ఆయన తన రక్తాన్ని దానంగా ఇవ్వడంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. తెల్లవారిన తర్వాత రక్తదాతలు అందుబాటులోకి రావడంతో మరో ఆరు యూనిట్ల రక్తాన్ని అందజేశారు. దీంతో ఆమె ప్రాణాలు నిలబడ్డాయి. రక్తదానంతో ప్రాణం పోసిన దాతలను ఇప్పటికీ ఆ పేద కుటుంబం తలచుకుంటూనే ఉంటుంది.
... మానవత్వానికి అద్దం పట్టే ఇలాంటి ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రక్తదాతలు సహకరించడం గమనార్హం.
అనంతపురం సిటీ: మానవత్వం అనేది కేవలం ఒక చుక్కలా కనిపించవచ్చు. కానీ ఆ చిన్న చుక్కల కలయికే విశాలమైన సముద్రమై.. ఆపదలో ఓ ఉన్న నిండు ప్రాణాన్ని కాపాడు తుంది. తోటివారి కష్టాన్ని చూసి చలించిపోయి స్వార్థాన్ని పక్కన పెట్టి సాయం చేసే మానవతావాదులు చేతల్లో చూపించే గొప్పదనమే రక్తదానం. అలాంటి వారి సేవలకు గుర్తుగా ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ప్రయోజనాలు ఎన్నో..
రక్తదానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అనంతపురంలోని సర్వజనాస్పత్రి రక్తనిధి మెడికల్ ఆఫీసర్, అసోషియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.లక్ష్మి అంటున్నారు. రక్తదానం వల్ల ఐరన్ నిల్వలు తగ్గి ధమనుల పనితీరు మెరుగు పడుతుందని, దీంతో గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుందని సూచిస్తున్నారు. అలాగే క్యాన్సర్ కారకాలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. తరచూ రక్తదానం చేస్తుండడం వల్ల అధిక బరువు తగ్గే అవకాశముంటుందన్నారు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న రక్త దానాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు.
సమృద్ధిగా నిల్వలు..
జిల్లా సర్వజనాస్పత్రిలోని రక్తనిధిలో అవసరమైన మేరకు రక్త నిల్వలు ఉన్నాయి. శనివారం నాటికి అన్ని గ్రూపులకు సంబంధించి 320 యూనిట్ల రక్తం నిల్వలు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అత్యధికంగా ‘ఓ’ పాజిటివ్, ‘బీ’ పాజిటివ్ రక్తం అవసరమవుతుంటుందని రక్తనిధి కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.
తలసేమియా బాధితులకు అండగా...
జీజీహెచ్‌లోని రక్తనిధికి అనుబంధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, గుత్తితో పాటు శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో స్టోరేజ్ పాయింట్లు ఉన్నాయి. అలాగే తలసేమియా బాధితులకు అండగా జీజీహెచ్‌లోని రక్తనిధి నిలుస్తోంది. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు పూర్తి ఉచితంగా అవసరమైన రక్తాన్ని అందజేస్తున్నారు. ప్రతి నెలా 60 నుంచి 70 మంది తలసేమియా బాధితులకు రక్తాన్ని అందించడం ద్వారా వారి ప్రాణాలు కాపాడుతున్నారు.
జీజీహెచ్‌లో రక్తదానం
ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా శనివారం సర్వజనాస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ మెడికల్ కళాశాల (జీఎంసీ) ప్రిన్సిపాల్ డాక్టర్ విజయశ్రీ హాజరై, ప్రారంభించారు. పాథలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ శివశంకర్‌నాయక్, రక్తనిధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రావణి, డాక్టర్ దివ్య, మైక్రోబయాలజీ విభాగం ఎన్‌ఎస్‌ఎస్ పీఓ డాక్టర్ లలిత తదితరులు పాల్గొన్నారు. పలువురు మెడికోలు, యువకులు స్వచ్ఛందంగా తరలి వచ్చి రక్తదానం చేశారు. 70 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
ఆదర్శంగా నిలుస్తున్న
పలువురు రక్తదాతలు
విపత్కర సమయంలో
మేమున్నామంటూ ముందుకు
రక్తదానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహణ


