బాధ్యులెవరు.. బాధితులెవరు? | - | Sakshi
Sakshi News home page

బాధ్యులెవరు.. బాధితులెవరు?

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

అనంతపురం క్రైం: నగరపాలక సంస్థ కార్యాలయంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల విక్రయాల విషయం చర్చనీయాంశమైంది. వరుసగా కథనాలు వెలువడినా.. బాధితుల నుంచి ఫిర్యాదులు అందినా.. బాధ్యులెవరు.. బాధితులెవరు అనే విషయాలు వెల్లడించకుండా అధికారులు మాత్రం మౌనంగా ఉన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల అమ్మకాల బాగోతం చాలాకాలంగా సాగుతోంది. ఈనెల 10న జనన, మరణ ధ్రువీకరణ పత్రాల అమ్మకాల వ్యవహారం మరోమారు వెలుగుచూసింది. తన తల్లి మరణ ధువ్రీకరణ పత్రం జారీ కోసం రూ.1800 డిజిటల్‌ చెల్లింపుల ద్వారా వసూలు చేశారని నగరంలోని మారుతీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. దీంతో బాగోతం మరోమారు వెలుగుచూసింది. మరణ ధృవీకరణ పత్రాల జారీ వ్యవహారంపై వరుసగా ఆరోపణలు, ఆధారాలతో కూడిన ఫిర్యాదులు అందినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2025 నవంబర్‌ 26న మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. సంబంధిత ఆధారాలు, పత్రాలు బయటకు వచ్చిన నేపథ్యంలో విచారణ చేపడతామని అధికారులు చెప్పినా.. ఇప్పటికీ పట్టించుకోలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జారీ చేయాల్సిన మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి మధ్యవర్తుల ద్వారా రూ.1,800 వసూలు చేసినట్లు డిజిటల్‌ చెల్లింపు ఆధారాలతో సహా ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. చెల్లింపులకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఒకటి కాదు... రెండు కాదు... వరుసగా ఒకే విభాగంపై ఆధారాలతో కూడిన ఫిర్యాదులు అందాయి. అయినా బాధ్యులు ఎవరు?, వారిపై ఏ చర్యలు తీసుకున్నారు? విచారణ ఎక్కడ ఆగింది? అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం లభించడం లేదు. ఉన్నతాధికారులు ఈ అక్రమార్కులను, లంచావతారులను ప్రోత్సహిస్తున్నారా? లేక ఈ తీగ లాగితే ఎవరి డొంక ఎక్కడ కదులుతుందోనని మౌనంగా ఉన్నారో తెలియాల్సి ఉంది.

డిజిటల్‌ చెల్లింపులు చేశారు

తాజాగా వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. మరణ ధ్రువీకరణ పత్రం జారీకి సంబంధించి ఉద్యోగులు, సిబ్బంది ఏ ఒక్కరూ డబ్బు డిమాండ్‌ చేయలేదు. మహేష్‌ అనే వ్యక్తి తనకు ఎక్స్‌ట్రా కాఫీలు కావాలని అడిగితే వాటికి సంబంధించి మీ సేవ సెంటర్‌లో తీసుకోవాలని చెప్పారని తెలిసింది. దీనిపై ఇంకా విచారణ జరుగుతోంది. వాస్తవాలు తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తాం. ప్రజలు ఎవరు లంచం జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా డబ్బు డిమాండ్‌ చేస్తే మాకు ఫిర్యాదు చేయండి.

– సునీత, ఇన్‌చార్జ్‌ ఎంహెచ్‌ఓ

‘అమ్మకానికి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు

ఫిర్యాదులందినా నగరపాలక సంస్థ అధికారుల మౌనం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement