కూడేరు: బాలికలు తక్కువ సంఖ్యలో ఉన్నారని కూడేరులో బీసీ బాలికల వసతి గృహాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వసతి గృహం అధికారులు కలెక్టర్ ఉత్తర్వుల కాగితాన్ని వసతి గృహం వద్ద శుక్రవారం అతికించారు. ఏటా వసతి గృహంలో బాలికల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. గత విద్యా సంవత్సరంలో హాస్టల్లో 12 మంది బాలికలు ఉన్నారు. అందులో నలుగురు కేజీబీవీలో సీటు రావడంతో వెళ్లి పోయారు. అనంతపురానికి చెందిన ఇద్దరు బాలికలు ఉండగా, వారు వెనక్కి వెళ్లారు. దీంతో కేవలం ఆరుగురు బాలికలే మిగిలారు. ఆరుగురికి వార్డెన్, వంట మనిషి, అటెండర్ పెట్టి హాస్టల్ నిర్వహించడం భారమవుతుందన్న ఉద్దేశంతో తాత్కాలికంగా హాస్టల్ మూసి వేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉన్న ఆరు మంది బాలికల తల్లిదండ్రుల అంగీకారంతో విడపనకల్లు హాస్టల్లో చేర్పిస్తున్నట్లు వార్డెన్ మాధవీలత తెలిపారు.
డ్రిప్, స్ప్రింక్లర్ల
మంజూరు వేగవంతం
అనంతపురం అగ్రికల్చర్: రైతులు సకాలంలో పంటలు సాగు చేసుకునేందుకు వీలుగా దరఖాస్తు చేసుకున్న వారికి డ్రిప్, స్ప్రింక్లర్లు మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని ఏపీఎంఐపీ ఓఎస్‌డీ చేరెడ్డి పుల్లారెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఏపీఎంఐపీ కార్యాలయంలో ఏపీడీ ధనుంజయతో కలిసి ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న డ్రిప్ కంపెనీ డీసీవోలు, ఎంఐ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. మార్చితో ముగిసిన 2025–26కు సంబంధించి మంజూరు చేసి ఇంకా మెటీరియల్ సరఫరా చేయకపోవడం, చేసి ఉంటే పొలాల్లో బిగింపు పూర్తి కానివాటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నెలాఖరులోపు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక ప్రస్తుత 2026–27కు సంబంధించి మంజూరు ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. అర్హత కలిగిన ప్రతి రైతుకూ ఇవ్వాలన్నారు. దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ప్రాథమిక తనిఖీ చేయాలన్నారు. వెంటనే బీవోక్యూ, బీఎంఎస్ పూర్తి చేసి రైతు వాటా డిజిటల్ పద్ధతిలో కట్టించాలని ఆదేశించారు. తమ వాటా చెల్లించిన రైతులకు ఆలస్యం చేయకుండా పరికరాలు పంపిణీ చేయాలన్నారు. పరికరాల నాణ్యత విషయంలో రాజీపడేది లేదన్నారు.
విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ప్రసాద్‌కు పదోన్నతి
అనంతపురం సెంట్రల్: జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అడిషనల్ ఎస్పీ వై.బి.పి.టి.ఎ.ప్రసాద్‌కు ఎస్పీ (నాన్ కేడర్)గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం పలువురు విజిలెన్స్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపి.. ఘనంగా సత్కరించారు.


